LOADING...
Apple: ఆపిల్ అమెరికాలో మరో $100 బిలియన్ పెట్టుబడి 
ఆపిల్ అమెరికాలో మరో $100 బిలియన్ పెట్టుబడి

Apple: ఆపిల్ అమెరికాలో మరో $100 బిలియన్ పెట్టుబడి 

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 07, 2025
08:40 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై అదనపు దిగుమతి సుంకాలు (ట్యారిఫ్‌లు) విధించడంతో ఆపిల్ కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే నాలుగేళ్లలో అమెరికాలో తయారీ, సరఫరా వ్యవస్థలను విస్తరించేందుకు ఆపిల్ మరో $100 బిలియన్ పెట్టుబడి పెట్టనుందని కంపెనీ ప్రకటించింది. ఇటీవల ఆపిల్ భారతదేశంలో ఐఫోన్ తయారీని పెంచడంపై ట్రంప్ తీవ్రంగా వ్యతిరేకించిన నేపథ్యంలో ఈ కీలక ప్రకటన వచ్చింది. ఈ విషయాన్ని ట్రంప్ బుధవారం వైట్‌హౌస్‌లో ఒక పెద్ద విజయం అంటూ ప్రకటించే అవకాశముంది.

వివరాలు 

ఆపిల్ మొత్తం అమెరికా పెట్టుబడి ప్రణాళిక $600 బిలియన్లకు..

"ఆపిల్‌తో ఈ రోజు ప్రకటించిన అంశం అమెరికన్ తయారీ రంగానికి మరో గెలుపు. ఇది వ్యూహాత్మక భాగాలను తిరిగి అమెరికాలో తయారు చేసే దిశగా కీలక అడుగు," అని వైట్‌హౌస్ అధికార ప్రతినిధి టేలర్ రోజర్స్ తెలిపారు. ఈ పెట్టుబడి ద్వారా ఆపిల్ మొత్తం అమెరికా పెట్టుబడి ప్రణాళిక $600 బిలియన్లకు పెరిగింది. ఇంతకు ముందు కంపెనీ $500 బిలియన్‌ పెట్టుబడిని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇటీవల ట్రంప్ ఆపిల్‌పై విమర్శలు చేశారు. భారతదేశంలో తయారీ విస్తరణపై "సమస్య" ఉందన్నారు. ఖతార్‌లో ఉన్న సమయంలో CEO టిమ్ కుక్‌కు " మీరు భారతదేశంలో నిర్మించడం ఇష్టం లేదు" అని తాను స్పష్టంగా చెప్పానని ట్రంప్ గుర్తు చేశారు.

వివరాలు 

19 బిలియన్ చిప్స్ అమెరికా నుంచే..

ఇక ఇదే రోజున ట్రంప్ భారత్‌ వస్తువులపై మరో 25 శాతం అదనపు సుంకం ప్రకటించారు. భారత్‌ రష్యా నుంచి ఇంకా చమురు దిగుమతి చేస్తోందని పేర్కొన్నారు. కొత్త ట్యారిఫ్‌లు మరో 21 రోజుల్లో అమలులోకి రానుండగా, భారత దిగుమతులపై మొత్తం సుంకం 50 శాతానికి చేరే అవకాశం ఉంది. ఆపిల్ ఈ విషయంపై బుధవారం స్పందించలేదు కానీ, ఇటీవల ఓ ఎర్నింగ్స్ కాల్‌లో CEO టిమ్ కుక్ మాట్లాడుతూ.. "ఇప్పటికే 19 బిలియన్ చిప్స్ అమెరికా నుంచే వస్తున్నాయి. ఇంకా చాలా కార్యక్రమాలు ఇక్కడే చేస్తున్నాం," అని అన్నారు.

వివరాలు 

 6 శాతంపెరిగిన ఆపిల్ షేర్లు

ఇందులో భాగంగా ఆపిల్ అమెరికాలో ఏకైక రేర్ ఎర్త్ తయారీ సంస్థ అయిన MP మటీరియల్స్‌తో $500 మిలియన్ ఒప్పందం కూడా కుదుర్చుకుంది. టెక్సాస్‌లోని ఫ్యాక్టరీలో రీసైకిల్ చేసిన మాగ్నెట్స్ తయారీకి ఇది దోహదపడుతుంది. ఇవి ఐఫోన్లలో ఉపయోగిస్తారు. "అమెరికాలో ఎన్నో పనులు జరుగుతున్నాయి," అని కుక్ అన్నారు. ఐఫోన్‌కు ఉపయోగించే గ్లాస్ డిస్‌ప్లే, ఫేస్ రికగ్నిషన్ మాడ్యూళ్ల వంటి భాగాలు కూడా అమెరికాలో తయారవుతున్నాయని వివరించారు. ఈ ప్రకటనతో బుధవారం ఆపిల్ షేర్లు 6 శాతం పెరిగాయి. ఆపిల్ స్టాక్‌ను కలిగి ఉన్న లాఫర్ టెంగ్లర్ ఇన్వెస్ట్మెంట్స్ CEO నాన్సీ టెంగ్లర్ మాట్లాడుతూ.. "టిమ్ కుక్ ట్రంప్ పరిపాలనకు ఓలివ్ బ్రాంచ్ అందిస్తున్నారని మార్కెట్ ఊపిరి పీల్చుకుంది," అన్నారు.

వివరాలు 

హార్డ్‌వేర్, తయారీ బలాలపై దృష్టి 

అయినప్పటికీ, ఈ సంవత్సరం ఆపిల్ స్టాక్ 14 శాతం మేర పడిపోయింది. ప్రధానంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో ఆపిల్ ముందుగా అడుగు పెట్టకపోవడమే దీనికి కారణమని నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు కంపెనీ మళ్లీ హార్డ్‌వేర్, తయారీ బలాలపై దృష్టి పెట్టడం ద్వారా దానిని సరిచేయాలని చూస్తోంది.