Money: వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్నారా?.. ప్రధాని ముద్రా యోజన ద్వారా రూ.10 లక్షలు పొందండి ఇలా..
ఈ రోజుల్లో చదువుకున్నవారు ఉద్యోగాలు చేయడానికన్నా సొంతంగా చిన్న వ్యాపారాలు ప్రారంభించేవారు ఎక్కువగా ఉన్నారు. ఇలాంటి అభిరుచులు ఉన్నవారికి ప్రభుత్వాలు కొన్ని ప్రోత్సాహకాలు అందిస్తున్నాయి. చిరు వ్యాపారులు, సూక్ష్మ, చిన్న తరహా సంస్థలను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి ముద్రా యోజన (Pradhan Mantri MUDRA Yojana) పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా అర్హత గల వ్యక్తులు ఎలాంటి పూచీకత్తు అవసరం లేకుండా రూ.10 లక్షల వరకు రుణం పొందవచ్చు. ఈ రుణాలను బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (NBFCs), మైక్రో ఫైనాన్స్ సంస్థలు (MFIs), ఇతర ఆర్థిక సంస్థలు ద్వారా మంజూరు చేస్తారు.
కార్పొరేట్, వ్యవసాయేతర ప్రయోజనాల కోసం రుణాలు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2015 ఏప్రిల్ 8న స్వయం ఉపాధిని ప్రోత్సహించే లక్ష్యంతో ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద, కార్పొరేట్, వ్యవసాయేతర ప్రయోజనాల కోసం రుణాలను అందిస్తున్నారు. నిరుద్యోగులు, తమ స్వంతంగా వ్యాపారం ప్రారంభించాలనుకునే యువకులు లేదా తమ వ్యాపారాన్ని విస్తరించాలనుకునే చిన్న వ్యాపారవేత్తలు ఈ పథకాన్ని ఉపయోగించుకోవచ్చు. PMMY క్రెడిట్ లోన్ వివరాలు: PMMY క్రెడిట్ టర్మ్ లోన్‌లు దీర్ఘకాలిక పెట్టుబడుల కోసం,వర్కింగ్ క్యాపిటల్ రోజువారీ అవసరాల కోసం ఉపయోగించవచ్చు. ఈ రుణాలు తయారీ, వ్యాపారం, సేవల రంగాలలోని చిన్న వ్యాపారాల కోసం, అలాగే పౌల్ట్రీ, పాడి పరిశ్రమ, తేనెటీగల పెంపకం వంటి వ్యవసాయానికి సంబంధించిన కార్యకలాపాలకు అందుబాటులో ఉంటాయి.
ముద్రా లోన్ కోసం ఆన్‌లైన్‌లో ఎలా దరఖాస్తు చేయాలి?
1. మొదటగా జన్ సమర్థ్ పోర్టల్ తెరవండి. 2. వెబ్‌సైట్‌లో ఉన్న 'స్కీమ్స్' డ్రాప్‌డౌన్ మెనూలో 'బిజినెస్ యాక్టివిటీ లోన్' ఎంపిక చేసి, 'ప్రధాన్ మంత్రి ముద్రా యోజన' ను సెలక్ట్ చేయండి. 3. కిందికి స్క్రోల్ చేసి 'చెక్ ఎలిజిబిలిటీ' పై క్లిక్ చేయండి. 4. మీరు చేనేత నేత, మాన్యువల్ స్కావెంజర్ లేదా వీధి వ్యాపారివై ఉంటే, 'అదర్ బిజినెస్ లోన్' ను ఎంచుకోండి. 5. మీరు చేపట్టిన వ్యాపారం కొత్తదా లేదా ఇప్పటికే ఉన్నదా, వ్యాపార రకం, స్థానం, వ్యాపారానికి అంచనా వ్యయం, మీ స్వంత నిధులతో ఎంత పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారో వివరాలు సమర్పించండి. ఇలా చేయడం ద్వారా ముద్రా లోన్ కోసం ఆన్‌లైన్‌లో సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చు.
మీ రుణ అర్హతను పోర్టల్ ఎలా లెక్కిస్తుంది:
మీ ప్రాజెక్ట్ ధర రూ. 2 లక్షలు ఉంటే, మీరు రూ. 50,000 పెట్టుబడి పెట్టగలిగితే, మీకు అవసరమైన రుణ మొత్తం రూ. 1.5 లక్షలు అవుతుంది. మీ నెలసరి EMI, రుణ కాల వ్యవధి వంటి వివరాలు తెలుసుకోవాలంటే 'క్యాలిక్యులేట్ ఎలిజిబిలిటీ' బటన్‌పై క్లిక్ చేయండి. మీరు మీ మొబైల్ నంబర్‌తో లాగిన్ చేసి, 'ప్రైవసీ పాలసీ', 'నిబంధనలు & షరతులు' అంగీకరించిన తర్వాత ముద్ర స్కీమ్ అప్లికేషన్ ప్రాసెస్ కొనసాగించండి. పోర్టల్ అవసరమైన డాక్యుమెంట్ల జాబితాను చూపిస్తుంది. వాటిని అంగీకరించి, సమర్పించాలి.
వెరిఫికేషన్ కోసం పాన్, ఉద్యమ్ రిజిస్ట్రేషన్, ఆధార్‌ని ఉపయోగించండి
మీ వ్యాపారం GST నమోదు చేయకపోతే, కొంత తక్కువ నికర అమ్మకాలు లేదా మీ ఉత్పత్తి/సేవకు వర్తించని కారణాల వలన GST మినహాయింపు పొందేందుకు సంబంధించి పోర్టల్ మీకు కొన్ని వివరాలను అడుగుతుంది. మీ మంత్లీ అమ్మకాల వివరాలను, వ్యాపార సమాచారాన్ని అందించండి. తర్వాత, బ్యాంక్ స్టేట్‌మెంట్‌ల ద్వారా లేదా మీ అకౌంట్‌ను వెరిఫై చేయడం ద్వారా బ్యాంక్ సమాచారం సమర్పించండి. మీ ఉద్యోగుల సమాచారం, వ్యాపార చిరునామా, ఇప్పటికే ఉన్న రుణాల గురించి వివరాలను జోడించండి.
పోర్టల్ వివిధ బ్యాంకులు, వాటి వడ్డీ రేట్లు, లోన్ టెన్యూర్స్‌తో కూడిన లోన్ ఆఫర్
ఫామ్‌ను పూర్తి చేసిన తర్వాత, పోర్టల్ వివిధ బ్యాంకులు, వాటి వడ్డీ రేట్లు, లోన్ టెన్యూర్స్‌తో కూడిన లోన్ ఆఫర్‌లను అందిస్తుంది. మీ అవసరాలకు అనుకూలమైన ఉత్తమ లోన్ ఆఫర్‌ను ఎంపిక చేసుకోండి. మీ లోన్ అప్రూవ్ అయిన తర్వాత, లోన్ అమౌంట్ విడుదల చేసే ముందు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం బ్యాంక్ శాఖను సందర్శించాలని కోరవచ్చు.