Loading...
Bank write off loans: పదేళ్లలో రూ.18.08 లక్షల కోట్ల రుణాలు రైట్‌ఆఫ్‌ చేసిన బ్యాంకులు
పదేళ్లలో రూ.18.08 లక్షల కోట్ల రుణాలు రైట్‌ఆఫ్‌ చేసిన బ్యాంకులు

Bank write off loans: పదేళ్లలో రూ.18.08 లక్షల కోట్ల రుణాలు రైట్‌ఆఫ్‌ చేసిన బ్యాంకులు

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 25, 2026
11:37 am

ఈ వార్తాకథనం ఏంటి

భారతీయ బ్యాంకులు గత పదేళ్లలో ఏకంగా రూ.18.08 లక్షల కోట్ల రుణాలను రైట్‌ఆఫ్‌ చేశాయి. అయితే 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఈ మొత్తం 8.2 శాతం తగ్గింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో రూ.1.57 లక్షల కోట్ల రుణాలను రైట్‌ఆఫ్‌ చేయగా.. 2025-26లో ఆ మొత్తం రూ.1.44 లక్షల కోట్లకు చేరింది. 2023-24లో ఇది రూ.1.70 లక్షల కోట్లుగా ఉంది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) సమాచార హక్కు చట్టం (RTI) కింద అడిగిన ప్రశ్నకు ఇచ్చిన సమాధానంలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. బ్యాంకుల్లో పేరుకుపోతున్న మొండి బకాయిలు, రుణాలు ఎగ్గొట్టిన వారి వివరాలు, వాటి వసూళ్లలో ఉన్న సమస్యలపై ఈ గణాంకాలు మరోసారి చర్చకు దారితీశాయి.

వివరాలు 

అప్పులు మాత్రం మాఫీ కాదు

ఆర్‌ బి ఐ వెల్లడించిన వివరాల ప్రకారం.. 2016-17 నుంచి 2025-26 ఆర్థిక సంవత్సరం వరకు షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు మొత్తం రూ.18,07,812 కోట్ల రుణాలను రైట్‌ఆఫ్‌ చేశాయి.

బ్యాంకుల ఖాతాల్లో మొండి బకాయిలుగా నమోదైన రుణాలను తగ్గించుకోవడానికి ఈ విధానం ఉపయోగపడుతోంది.

అయితే రుణాలను రైట్‌ఆఫ్‌ చేసినంత మాత్రాన వాటిని తీసుకున్నవారి అప్పులు రద్దయినట్లు కాదు.

బ్యాంకులు తమ లెక్కల్లో ఆ మొత్తాలను పక్కకు జరిపినప్పటికీ.. రుణగ్రహీతలు తిరిగి చెల్లించాల్సిన బాధ్యత కొనసాగుతుంది.

రుణాల వసూళ్లపై మాత్రం ఇంకా అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

వివరాలు 

రైట్‌ఆఫ్‌లలో తగ్గుదల.. అయినా కొనసాగుతున్న మొండి బకాయిల భారం

బ్యాంకులు అత్యధికంగా 2018-19 ఆర్థిక సంవత్సరంలో రూ.2.39 లక్షల కోట్ల రుణాలను రైట్‌ఆఫ్‌ చేశాయి.

ఆ తర్వాత రెండు ఆర్థిక సంవత్సరాల్లోనూ ఈ మొత్తం రూ.2 లక్షల కోట్లకు పైగానే ఉంది.

2019-20లో రూ.2.34 లక్షల కోట్లు, 2020-21లో రూ.2.03 లక్షల కోట్ల రుణాలను రైట్‌ఆఫ్‌ చేశాయి. ఆ తర్వాత ఈ మొత్తం హెచ్చుతగ్గులకు లోనైంది.

2024-25లో రూ.1.57 లక్షల కోట్లుగా ఉన్న రైట్‌ఆఫ్‌లు.. 2025-26లో రూ.1.44 లక్షల కోట్లకు తగ్గాయి.

అయితే రుణాల రైట్‌ఆఫ్‌లు తగ్గినంత మాత్రాన బ్యాంకుల మొండి బకాయిల సమస్య పూర్తిగా పరిష్కారమైనట్లు భావించకూడదు.

ADVERTISEMENT

వివరాలు 

మొండి బకాయిల్లో భారీ తగ్గుదల.. 1.73 శాతానికి చేరిన ఎన్‌పీఏలు

మరోవైపు బ్యాంకుల స్థూల నిరర్థక ఆస్తులు (Gross NPAs) కూడా తగ్గాయి. 2025-26 ఆర్థిక సంవత్సరం చివరికి ఇవి రూ.3.86 లక్షల కోట్లకు చేరాయి.

బ్యాంకులు ఇచ్చిన మొత్తం రుణాల్లో ఇది 1.73 శాతం. అంతకుముందు ఏడాది ఈ మొత్తం రూ.4.32 లక్షల కోట్లుగా ఉంది.

2017-18లో బ్యాంకుల మొండి బకాయిలు గరిష్ఠంగా రూ.10.40 లక్షల కోట్లకు చేరాయి. అప్పట్లో మొత్తం రుణాల్లో ఇవి 11.18 శాతంగా నమోదయ్యాయి.

అప్పటితో పోలిస్తే ప్రస్తుతం స్థూల మొండి బకాయిలు 63 శాతం తగ్గడం గమనార్హం.

ADVERTISEMENT

వివరాలు 

ప్రభుత్వ రంగ బ్యాంకులే ముందంజ

పదేళ్లలో అత్యధిక రుణాలను రైట్‌ఆఫ్‌ చేసిన బ్యాంకుల జాబితాలో ప్రభుత్వ రంగ బ్యాంకులే ముందున్నాయి.

దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI) రూ.3,03,160 కోట్ల రుణాలను రైట్‌ఆఫ్‌ చేసింది.

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (PNB) రూ.1,31,170 కోట్లు, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా రూ.1,14,701 కోట్ల రుణాలను రైట్‌ఆఫ్‌ చేశాయి.

యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా రూ.1,13,112 కోట్లు, కెనరా బ్యాంక్‌ రూ.1,03,949 కోట్ల రుణాలను ఈ జాబితాలో చేర్చాయి.

ఈ ఐదు ప్రభుత్వ రంగ బ్యాంకులు కలిపి రూ.7,66,093 కోట్ల రుణాలను రైట్‌ఆఫ్‌ చేశాయి.

వివరాలు 

ప్రభుత్వ రంగ బ్యాంకులే ముందంజ

ఆర్‌బీఐ గణాంకాల ప్రకారం.. అత్యధిక రుణాలను రైట్‌ఆఫ్‌ చేసిన టాప్‌-10 బ్యాంకులు పదేళ్లలో కలిపి రూ.11.73 లక్షల కోట్ల రుణాలను రద్దు చేశాయి.

ఈ జాబితాలో ప్రభుత్వ రంగ బ్యాంకులతో పాటు ప్రైవేటు రంగానికి చెందిన ఐసీఐసీఐ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ కూడా ఉన్నాయి.

బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌ సైతం ఈ జాబితాలో ఉన్నాయి. ఈ పది బ్యాంకుల రైట్‌ఆఫ్‌ మొత్తం రూ.11,73,070 కోట్లుగా నమోదైంది.

అంటే అన్ని షెడ్యూల్డ్‌ కమర్షియల్‌ బ్యాంకులు రైట్‌ఆఫ్‌ చేసిన మొత్తం రుణాల్లో దాదాపు 65 శాతం ఈ పది బ్యాంకుల నుంచే ఉన్నాయి.

మొత్తం రైట్‌ఆఫ్‌లలో ప్రభుత్వ రంగ బ్యాంకుల వాటా దాదాపు 63 శాతంగా ఉంది.

వివరాలు 

ప్రభుత్వ రంగ బ్యాంకులే ముందంజ

ఈ గణాంకాలు బ్యాంకుల రుణాల మంజూరు విధానం, రిస్క్‌ అంచనాలు,బాధ్యతాయుతమైన వ్యవహారం,భారీ మొత్తంలో రుణాలు తీసుకుని చెల్లించని వారిపై తీసుకుంటున్న చర్యలపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.

2016-17లో బ్యాంకులు రూ.1.08 లక్షల కోట్ల రుణాలను రైట్‌ఆఫ్‌ చేయగా.. 2017-18లో రూ.1.62 లక్షల కోట్లు, 2018-19లో రూ.2.39 లక్షల కోట్లుగా నమోదయ్యాయి.

రుణాలను రైట్‌ఆఫ్‌ చేయడం వల్ల వసూళ్లు మెరుగుపడ్డాయని చెప్పలేమని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

గత ఐదేళ్లలో రైట్‌ఆఫ్‌ చేసిన రుణాల్లో కేవలం 13 నుంచి 15 శాతం మాత్రమే బ్యాంకులు తిరిగి వసూలు చేయగలిగాయి.

వివరాలు 

ప్రభుత్వ రంగ బ్యాంకులే ముందంజ

ఈ మొత్తం సుమారు రూ.1.32 లక్షల కోట్లు. 2020-21లో రూ.30,104 కోట్లు, 2021-22లో రూ.33,534 కోట్లు, 2022-23లో రూ.45,548 కోట్ల రుణాలను బ్యాంకులు తిరిగి వసూలు చేసినట్లు 2023 జులైలో వెల్లడైన గణాంకాలు చెబుతున్నాయి.

కేవలం లెక్కల్లో మొండి బకాయిలను తగ్గించడం కాకుండా.. వాస్తవంగా ఎంత మొత్తం తిరిగి వసూలు చేస్తున్నారన్నదే కీలకమని ఈ వివరాలు స్పష్టం చేస్తున్నాయి.

వివరాలు 

రైట్‌ఆఫ్‌ అంటే ఏమిటి?

బ్యాంకులు రుణాలను రైట్‌ఆఫ్‌ చేయడమంటే అప్పును పూర్తిగా మాఫీ చేయడం కాదు.

ఇది కేవలం అకౌంటింగ్‌ ప్రక్రియ మాత్రమే. బ్యాంకు బ్యాలెన్స్‌ షీట్‌లో ఉన్న రుణ మొత్తాన్ని అక్కడి నుంచి తొలగించి..'అడ్వాన్సెస్‌ అండర్‌ కలెక్షన్‌'అనే విభాగంలో చూపిస్తారు.

ఆ తర్వాత ప్రత్యేక బృందాలు రుణాల వసూళ్ల కోసం ప్రయత్నాలు కొనసాగిస్తాయి.

రుణగ్రహీత తిరిగి చెల్లించాల్సిన బాధ్యతలో ఎలాంటి మార్పు ఉండదు.

అలాగే ఆ మొత్తాన్ని వసూలు చేసుకునే హక్కు బ్యాంకులకు అలాగే ఉంటుంది.

రుణగ్రహీత వరుసగా 90రోజుల పాటు అసలు లేదా వడ్డీ చెల్లించకపోతే ఆ రుణాన్ని నిరర్థక ఆస్తిగా (NPA)పరిగణిస్తారు.

ఇలా గుర్తించిన రుణాల వల్ల భవిష్యత్తులో నష్టాలు వచ్చే అవకాశం ఉండటంతో బ్యాంకులు కొంత మొత్తాన్ని ముందుగానే కేటాయించాల్సి ఉంటుంది.

వివరాలు 

రైట్‌ఆఫ్‌ అంటే ఏమిటి?

రుణం తిరిగి వచ్చే అవకాశాలు తగ్గినప్పుడు బ్యాంకులు తమ నిబంధనల ప్రకారం ఆ మొత్తాన్ని రైట్‌ఆఫ్‌ చేస్తాయి.

అయినప్పటికీ చట్టపరమైన మార్గాలతో పాటు ఇతర పద్ధతుల్లోనూ రుణాల వసూళ్లను కొనసాగించాల్సి ఉంటుంది.

బ్యాంకుల బ్యాలెన్స్‌ షీట్లను మెరుగుపరచడం, పన్నుల పరంగా ప్రయోజనం పొందడం వంటి లక్ష్యాలతో సాంకేతిక రైట్‌ఆఫ్‌లను చేపడుతున్నట్లు ఆర్‌బీఐ పేర్కొంది.

వివరాలు 

రైట్‌ఆఫ్‌ అంటే ఏమిటి?

అయితే ఈ వ్యవహారంలో మరో కీలకమైన అంశం రుణాలు తీసుకుని చెల్లించని వ్యక్తుల వివరాలు బహిరంగంగా అందుబాటులో లేకపోవడం.

మొత్తం ఎంత రుణాన్ని రైట్‌ఆఫ్‌ చేశారన్న సమాచారం ఉన్నప్పటికీ..ఆ మొత్తాల్లో ఏయే వ్యక్తులు లేదా సంస్థల వాటా ఎంతన్న వివరాలు మాత్రం వెల్లడికావడం లేదు.

దీంతో భారీ రుణాలు ఎగ్గొట్టినవారిపై తీసుకుంటున్న చర్యలు, ప్రజల సొమ్ము తిరిగి వసూలు చేసే విధానం, బ్యాంకుల జవాబుదారీతనంపై మరిన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ADVERTISEMENT