అమెరికాలో 'ఫస్ట్ రిపబ్లిక్' బ్యాంకు దివాళా; జేపీ మోర్గాన్ కంపెనీ టేకోవర్
అమెరికాలో మరో బ్యాంకు దివాళాతో కుప్పకూలిపోయింది. ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్ దివాళా తీసింది. దీంతో ఆ బ్యాంకును జేపీ మోర్గాన్ సంస్థ టేకోవర్ చేస్తున్నట్లు కాలిఫోర్నియా డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ అండ్ ఇన్నోవేషన్ ఒక ప్రకటనలో తెలిపింది. బ్యాంకు అన్ని ఆస్తులతో సహా అన్ని డిపాజిట్లను స్వీకరిస్తుంద జేపీ మోర్గాన్ సంస్థ స్వీకరించనున్నట్లు ప్రకటించింది. కాలిఫోర్నియా రెగ్యులేటర్ ఫెడరల్ డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్‌ను శాన్ ఫ్రాన్సిస్కో-ఆధారిత బ్యాంక్ రిసీవర్‌గా నియమించారు.
జేపీ మోర్గాన్ చేజ్ బ్యాంక్ పేరుతో ఫస్ట్ రిపబ్లిక్ శాఖలు
ఎనిమిది రాష్ట్రాల్లో ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్‌కు చెందిన మొత్తం 84శాఖలు జేపీ మోర్గాన్ చేజ్ బ్యాంక్ శాఖలుగా సోమవారం తిరిగి తెరవబడతాయని కాలిఫోర్నియా డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ అండ్ ఇన్నోవేషన్ తెలిపింది. ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్‌ను రెగ్యులేటర్లు టేకోవర్ చేస్తారనే ఊహాగానాల నేపథ్యంలో శుక్రవారం దీని షేర్లు రికార్డు కనిష్ట స్థాయికి పడిపోయాయి. షేరు విలువ దాదాపు 50 శాతానికి పైగా కుప్పకూలింది. ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంకును సాధ్యమైనంత వరకు రక్షించేందుకు ఫెడరల్ డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్ప్ ( ఎఫ్‌డీఐసీ), ట్రెజరీ డిపార్ట్‌మెంట్, ఫెడరల్ రిజర్వ్ ప్రయత్నిస్తున్నట్లు రాయిటర్స్ నివేదించింది. మొదటి త్రైమాసికంలో తమ డిపాజిట్లు 100 బిలియన్ డాలర్లకుపైగా క్షీణించాయని ఈ వారం ప్రారంభంలో ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంకు పేర్కొంది.