LOADING...
RBI New Rules: రుణ బకాయిల పేరుతో ఫోన్లు బ్లాక్‌ చేస్తామంటే కుదరదు: ఆర్‌బీఐ
రుణ బకాయిల పేరుతో ఫోన్లు బ్లాక్‌ చేస్తామంటే కుదరదు: ఆర్‌బీఐ

RBI New Rules: రుణ బకాయిల పేరుతో ఫోన్లు బ్లాక్‌ చేస్తామంటే కుదరదు: ఆర్‌బీఐ

వ్రాసిన వారు Sirish Praharaju
May 21, 2026
04:44 pm

ఈ వార్తాకథనం ఏంటి

రుణాలు తీసుకుని తిరిగి చెల్లించడంలో ఆలస్యం జరిగితే వినియోగదారులను ఇబ్బందులకు గురిచేసే బ్యాంకులు, వసూళ్ల సంస్థలపై భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ కఠిన చర్యలకు సిద్ధమైంది. రుణ వసూళ్ల పేరుతో జరుగుతున్న వేధింపులను అరికట్టేందుకు కొత్త మార్గదర్శకాలను ప్రతిపాదించింది. 'రుణాల వసూళ్లలో నియంత్రిత సంస్థల ప్రవర్తన, వసూళ్ల ప్రతినిధుల నియామకం' పేరుతో ముసాయిదా నిబంధనలను విడుదల చేసింది. ఈ ప్రతిపాదనలపై ప్రజలు, సంబంధిత వర్గాల అభిప్రాయాలను ఈ నెల 31 వరకు స్వీకరించనుంది. అనంతరం అక్టోబర్‌ 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి తీసుకురానుంది.

వివరాలు 

ఫోన్‌ నిలిపివేతపై స్పష్టమైన ఆంక్షలు

వ్యక్తిగత, వాహన, గృహ రుణాలు తీసుకున్న వారు వాయిదాలు చెల్లించడంలో విఫలమైతే వారి మొబైల్‌ ఫోన్లను బ్లాక్‌ చేయడం,సదుపాయాలను నిలిపివేయడం వంటి చర్యలు బ్యాంకులు చేపట్టకూడదని ఆర్‌ బి ఐ స్పష్టం చేసింది. అయితే మొబైల్‌ ఫోన్‌ లేదా ట్యాబ్‌ కొనుగోలు కోసం అదే బ్యాంకు రుణం ఇచ్చిన సందర్భంలో మాత్రమే కొన్ని పరిమిత చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని పేర్కొంది. ఇందుకు కూడా రుణ బకాయి 90 రోజులు దాటిన తర్వాతే అనుమతి ఉంటుందని తెలిపింది. అలాగే వినియోగదారులకు ముందుగా సమాచారం ఇచ్చి, స్పందన రాకపోతే మాత్రమే చర్యలు చేపట్టాలని సూచించింది. ఫోన్‌పై పరిమితులు విధించినా ఇంటర్నెట్‌ సేవలు, వచ్చే కాల్స్‌, అత్యవసర సేవలు, ప్రభుత్వ హెచ్చరిక సందేశాలు నిలిపివేయకూడదని పేర్కొంది.

వివరాలు 

ఏజెంట్ల మాటలు రికార్డ్

బకాయిలు పూర్తిగా చెల్లించిన తర్వాత గంటలోపు ఆంక్షలు తొలగించాలని ఆదేశించింది. ఆలస్యం జరిగితే ప్రతి గంటకు రూ.250 చొప్పున వినియోగదారునికి పరిహారం చెల్లించాలని ప్రతిపాదించింది. రుణాల వసూళ్ల కోసం బ్యాంకు సిబ్బంది లేదా వసూళ్ల ప్రతినిధులు చేసే ప్రతి కాల్‌కు సంబంధించిన సమయం,ఫోన్‌ నంబర్ల వివరాలను భద్రపరచాలని ఆర్‌బీఐ సూచించింది. వారు చేసే ఆడియో,టెక్ట్స్‌ సంభాషణలను కూడా నమోదు చేసి ఉంచాలని తెలిపింది. వసూళ్ల సమయంలో అసభ్య పదజాలం ఉపయోగించడం,బెదిరింపులకు దిగడం,పదేపదే కాల్స్‌ చేసి వేధించడం వంటి చర్యలను పూర్తిగా నిషేధించింది. అలాగే రుణగ్రహీతల వ్యక్తిగత సమాచారం, ఆడియో లేదా వీడియో రికార్డులను సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేయడం,అసభ్యకర సందేశాలు పంపడం వంటి చర్యలపై కూడా ఆర్‌బీఐ ఆంక్షలు విధించాలని ప్రతిపాదించింది.

Advertisement