
Money: వృద్ధాప్యంలో నెలకు రూ.3,000 ఫిక్స్‌డ్ పెన్షన్.. ఈ స్కీమ్‌కి ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే?
ఈ వార్తాకథనం ఏంటి
దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు తోడ్పాటు అందించే లక్ష్యంతో ప్రభుత్వం వివిధ రకాల పథకాలను రూపొందిస్తోంది.
ప్రత్యేకించి, వెనుకబడిన వర్గాలకు ఆర్థిక సహాయం అందించేందుకు అనేక పథకాలను అమలు చేస్తున్నది.
ఈ క్రమంలో, అసంఘటిత రంగంలోని కార్మికుల కోసం ప్రధాన మంత్రి శ్రమ యోగి మాన్‌ధన్ యోజన (PMSYM) పేరుతో ఒక పథకాన్ని ప్రవేశపెట్టింది.
ఈ పథకంతో అసంఘటిత రంగంలో ఉండే కార్మికులకు వృద్ధాప్యంలో నెలకు రూ. 3,000 ఫిక్స్‌డ్ పెన్షన్ అందిస్తుంది.
ఈ పథకానికి దరఖాస్తు ఎలా చేయాలి? ఎవరు అర్హులు? అందించే ప్రయోజనాలు ఏమిటి? అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
వివరాలు
పథకానికి ప్రత్యేకతలు
ఈ పథకంలో కార్మికులు 60 సంవత్సరాలు నిండిన తర్వాత ప్రతి నెలా రూ. 3,000 ఫిక్స్‌డ్ పెన్షన్ పొందుతారు.
పని చేస్తున్న సమయంలో ఈ పథకానికి కార్మికులు చేసిన కాంట్రిబ్యూషన్‌కు సమానమైన మొత్తాన్ని ప్రభుత్వం కూడా జమ చేస్తుంది.
ఉదాహరణకు, ఒక కార్మికుడు నెలకు రూ. 300 డిపాజిట్ చేస్తే, ప్రభుత్వం కూడా వారి అకౌంట్‌లో రూ. 300 జమ చేస్తుంది.
పెట్టుబడికి అర్హత
ఈ పథకానికి 18 నుంచి 40 సంవత్సరాల మధ్య వయసున్న కార్మికులు దరఖాస్తు చేసుకోవచ్చు.
కార్మికుడు కనీసం 20 సంవత్సరాల పాటు క్రమంగా పథకానికి కాంట్రిబ్యూట్ చేయాలి. 60 ఏళ్లు వచ్చాక నెలకు రూ. 3,000 పెన్షన్ ప్రారంభమవుతుంది.
వివరాలు
అర్హత ప్రమాణాలు
అసంఘటిత రంగ కార్మికులు: అసంఘటిత రంగంలో పనిచేస్తున్న వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
నెలవారీ ఆదాయ పరిమితి: కార్మికుని నెలవారీ ఆదాయం రూ. 15,000 మించకూడదు.
వయోపరిమితి: 18 నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.
బ్యాంక్ అకౌంట్, ఆధార్: దరఖాస్తుదారుడి బ్యాంక్ అకౌంట్ తప్పనిసరిగా వారి ఆధార్ కార్డ్‌కు లింక్ అవ్వాలి.
ఇతర పెన్షన్ ప్రయోజనాలు: దరఖాస్తుదారులు కేంద్ర ప్రభుత్వం అమలు చేసే ఏ ఇతర పెన్షన్ పథకంనుంచి ప్రయోజనం పొందకూడదు. మరేదైనా పథకం నుంచి లబ్ధి పొందిన వారు అనర్హులు.
వివరాలు
ఎలా దరఖాస్తు చేయాలి?
దరఖాస్తుకు ముందుగా మీ సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ (CSC)కి వెళ్లండి.
ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ వివరాలు (సేవింగ్స్ అకౌంట్ లేదా జన్ ధన్ అకౌంట్), నామినీ వివరాలను సమర్పించాలి.
సమాచారం వెరిఫై చేసిన తర్వాత, అకౌంట్ ఓపెన్ చేస్తారు, మీకు శ్రమ యోగి కార్డ్ అందజేస్తారు.
కార్మికులు మరింత సమాచారం కోసం అధికారిక మాన్‌ధన్ యోజన పోర్టల్‌ను సందర్శించవచ్చు లేదా టోల్-ఫ్రీ నంబర్ 1800 267 6888కి కాల్ చేయవచ్చు.
వివరాలు
ప్రభుత్వ మద్దతు
2024 మధ్యంతర బడ్జెట్‌లో, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ పథకానికి రూ. 177.24 కోట్లను కేటాయించారు.
అసంఘటిత రంగంలోని వీధి వ్యాపారులు, మధ్యాహ్న భోజన కార్మికులు, ఇటుక బట్టీ కార్మికులు, చెప్పులు కుట్టేవారు, గుడ్డలు ఉతికేవారు, రిక్షా పుల్లర్లు, భూమిలేని కార్మికులు, వ్యవసాయ కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, తోలు కార్మికులు తదితరులకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుంది.
దేశంలో ఇలాంటి అసంఘటిత కార్మికులు దాదాపు 42 కోట్ల మంది ఉన్నారు.