
Post Office Schemes: పెట్టుబడి భద్రతతోపాటు అధిక వడ్డీ లాభాలను అందించే టాప్-5 పోస్టాఫీసు పథకాలు!
ఈ వార్తాకథనం ఏంటి
పెట్టుబడికి రిస్క్ తీసుకోవాలననుకునేవారికి కేంద్ర ప్రభుత్వం అందించే పోస్ట్‌ఆఫీస్ పొదుపు పథకాలు మంచి ప్రత్యామ్నాయంగా నిలుస్తున్నాయి. దీర్ఘకాలిక ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకుని రూపొందించిన ఈ పథకాల ద్వారా పెట్టుబడికి భద్రతతో పాటు ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు లభిస్తాయి. ఇవి తక్కువ పెట్టుబడితో ప్రారంభించవచ్చు. రిస్క్ తక్కువ ఉండే పొదుపు మార్గాలు కోరుకునే వారు, పన్ను మినహాయింపు కోసం చూస్తున్న వారు వీటిని పరిశీలించవచ్చు. అటువంటి ప్రముఖ పోస్టాఫీస్ పథకాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
వివరాలు
1. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS)
ఈ పథకం ముఖ్యంగా 60 ఏళ్ల పైబడిన వారికి, అలాగే 50 ఏళ్ల తర్వాత వాలంటరీ రిటైరమెంట్ తీసుకున్న వారికి అనుకూలంగా ఉంటుంది. ఇది అత్యధిక వడ్డీ రేటును అందించే ప్రభుత్వ స్కీములలో ఒకటి. ఈ పథకంలో వడ్డీ చెల్లింపులు మూడు నెలలకోసారి జరిగే విధంగా ఉంటాయి. ప్రతి ఏడాది ఏప్రిల్, జులై, అక్టోబర్, జనవరి నెలల్లో మొదటి తేదీన వడ్డీ ఖాతాల్లో జమ అవుతుంది. ప్రస్తుతానికి ఈ పథకం 8.2 శాతం వార్షిక వడ్డీని ఇస్తోంది.
వివరాలు
2. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF)
పీపీఎఫ్ పొదుపు సాధనంగా ఉండటమే కాకుండా, పన్ను మినహాయింపు కలిగిన 'EEE' (ఎగ్జెమ్షన్-ఎగ్జెమ్షన్-ఎగ్జెమ్షన్) కేటగిరీలో ఉంటుంది. దీర్ఘకాలిక పెట్టుబడిదారులకు ఇది ఉత్తమ ఎంపిక. ప్రస్తుతానికి ఏడాదికి 7.1 శాతం వడ్డీ లభిస్తోంది. చక్రవడ్డీ లాభంతో పెట్టుబడి విలువ పెరుగుతుంది. కనీస కాలపరిమితి 15 సంవత్సరాలు. ఈ కాలం పూర్తైన తర్వాత, ఐదేళ్లకు ఒకసారి పొడిగించుకునే అవకాశం ఉంటుంది. దీర్ఘకాలం కొనసాగిస్తే అధిక రాబడిని అందించగలదు.
వివరాలు
3. పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ (POMIS)
ప్రతినెలా స్థిర ఆదాయం కోరుకునే వారికి ఈ పథకం అనుకూలంగా ఉంటుంది. ప్రస్తుతం ఇది 7.4 శాతం వార్షిక వడ్డీని అందిస్తోంది. ఈ పథకంలో పెట్టుబడిపై ఐదేళ్ల లాక్-ఇన్ వ్యవధి ఉంటుంది. ఐదేళ్ల తర్వాత పెట్టుబడి మొత్తాన్ని వెనక్కి తీసుకోవచ్చు లేదా అదే స్కీంలో మరో ఐదేళ్ల పాటు తిరిగి పెట్టవచ్చు. వ్యక్తిగత ఖాతాలో గరిష్ఠంగా రూ.9 లక్షలు, సంయుక్త ఖాతాలో రూ.15 లక్షల వరకూ పెట్టుబడి పెట్టే వీలుంది. వడ్డీ ద్వారా వచ్చే ఆదాయంపై పన్ను వర్తించనుంది.
వివరాలు
4. కిసాన్ వికాస్ పత్ర (KVP)
తక్కువ ప్రమాదంతో పెట్టుబడి రెట్టింపు కావాలనుకునే వారికి ఈ పథకం సరైనది. ఈ పథకంలో పన్ను మినహాయింపు లేకపోయినా, భద్రతతో కూడిన పెట్టుబడిగా గుర్తించబడుతుంది. ప్రస్తుతానికి వార్షికంగా 7.5 శాతం చక్రవడ్డీతో లాభాన్ని ఇస్తోంది. ఈ వడ్డీరేటు ఆధారంగా పెట్టుబడి మొత్తం 115 నెలల్లో (9 సంవత్సరాలు 5 నెలలు) రెట్టింపవుతుంది. దీర్ఘకాలిక పెట్టుబడి లక్ష్యానికి ఇది ఉపయోగపడుతుంది.
వివరాలు
5. సుకన్య సమృద్ధి యోజన (SSY)
ఈ పథకం ప్రత్యేకంగా ఆడపిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని రూపొందించబడింది. ఇది వార్షికంగా 8.2 శాతం చక్రవడ్డీతో కూడిన వడ్డీ రేటును అందిస్తోంది. సెక్షన్ 80C కింద ఈ పథకానికి పెట్టుబడులపై పన్ను మినహాయింపు లభిస్తుంది. అంతేకాకుండా, వడ్డీపై గానీ, మెచ్యూరిటీ సమయంలో వచ్చే మొత్తంపై గానీ ఎటువంటి పన్ను ఉండదు. అమ్మాయిల తల్లిదండ్రులు తప్పకుండా ఈ పథకాన్ని తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.