
Bharat Biotech: రూ.600 కోట్లు పెట్టుబడితో 'సెల్, జీన్ థెరపీ'లోకి భారత్ బయోటెక్..
ఈ వార్తాకథనం ఏంటి
టీకాల తయారీలో నిమగ్నమైన భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ సంస్థ, ఇప్పుడు సెల్, జీన్ థెరపీ విభాగాల్లోకి ప్రవేశిస్తోంది.
ఈ లక్ష్యంతోనే హైదరాబాద్ శివార్లలోని జీనోమ్ వ్యాలీలో సెల్, జీన్ థెరపీ, వైరల్ వెక్టర్ సదుపాయాన్ని ఏర్పాటు చేసింది.
క్యాన్సర్, తలసీమియా, హీమోఫీలియా వంటి జన్యుపరమైన వ్యాధులకు అవసరమైన చికిత్సా విధానాలు, ఔషధాలను అభివృద్ధి చేయడం ఈ విస్తరణ లక్ష్యంగా ఉంది.
దీనికోసం అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్, మాడిసన్‌తో కలిసి భారత్ బయోటెక్ పరిశోధన భాగస్వామ్యం కుదుర్చుకుంది.
ఈ ప్రాజెక్ట్ కోసం సుమారు 75 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.650 కోట్లు) పెట్టుబడి సిద్ధం చేశారు.
వివరాలు
ఖరీదైన చికిత్స.. అందుబాటులోకి
సెల్, జీన్ థెరపీ చాలా క్లిష్టమైన విభాగం అయినప్పటికీ,ఇందులోని సవాళ్లను అధిగమించి ప్రజలకు ప్రయోజనకరమైన చికిత్సలను అందించగలమనే నమ్మకంతో ముందుకెళ్తున్నామని భారత్ బయోటెక్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ డాక్టర్ కృష్ణ ఎల్ల తెలిపారు.
టార్గెటెడ్ జీన్ ఎక్స్‌ప్రెషన్,ఇమ్యూన్ సిస్టమ్ మాడ్యులేషన్, లాంగ్ టెర్మ్ సెల్ సర్వైవల్ వంటి ఆధునిక ప్రక్రియలను అభివృద్ధి చేయాల్సి ఉంటుందని చెప్పారు.
అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో సెల్ థెరపీ,జీన్ థెరపీ చికిత్సలకు 1-3 మిలియన్ డాలర్ల (సుమారు రూ.8.7-26.1 కోట్లు)వరకు ఖర్చవుతుందని,మనదేశంలోనూ కనీసం రూ.50 లక్షలు వెచ్చించాల్సి వస్తుందని భారత్ బయోటెక్ చీఫ్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ డాక్టర్ రేచస్ ఎల్ల తెలిపారు.
అయితే,ఈ ఖర్చును గణనీయంగా తగ్గించి మరింత మందికి అందుబాటులోకి తేవడమే తమ లక్ష్యమని చెప్పారు.
వివరాలు
భవిష్యత్ వైద్య విప్లవం
ప్రస్తుతం 5 ఔషధ ఉత్పత్తులపై పరిశోధన జరుగుతోందని, అందులో 2 సెల్ థెరపీకి సంబంధించినవని, మిగిలినవి జీన్ థెరపీ చికిత్సలకు సంబంధించినవని వివరించారు.
ఈ ఔషధాలను మూడేళ్లలోపు దేశీయంగా మార్కెట్లోకి తీసుకురావడంతో పాటు అంతర్జాతీయ మార్కెట్‌కూ అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.
హై-టైటర్ వైరల్ వెక్టార్స్‌తో పాటు రక్త క్యాన్సర్, ఘన అవయవ క్యాన్సర్, జన్యు సంబంధ వ్యాధులకు అవసరమైన చికిత్సలు, ఔషధాలను అభివృద్ధి చేయగలమని చెప్పారు.
అధునాతనమైన సీడీ19 కార్-టి సెల్ థెరపీ, జీన్ థెరపీ చికిత్సలను అందించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
వివరాలు
కృత్రిమ మేధతో కొత్త పరిష్కారాలు
భారత్ బయోటెక్ భాగస్వామ్యంతో, కృత్రిమ మేధ (AI) సాంకేతికతను ఉపయోగించి నూతన తరం కార్ (కెమరిక్ యాంటీజెన్ రిసెప్టర్) సెల్ థెరపీని అభివృద్ధి చేసేందుకు యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్ మాడిసన్ ప్రొఫెసర్ క్రిషాను తెలిపారు.