Stock Market: భారీ నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. మార్కెట్లపై 'ఫెడ్' దెబ్బ..
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లో బలహీన సంకేతాల వల్ల సూచీలపై ఒత్తిడి పెరిగి, మార్కెట్లు నష్టాల్లోకి జారిపోయాయి. ఉదయం 9:30కి సెన్సెక్స్ 948 పాయింట్లు పడిపోయి 79,169 వద్ద ట్రేడవుతుండగా, నిఫ్టీ 307 పాయింట్లు తగ్గి 23,891 వద్ద కొనసాగుతోంది. మార్కెట్ ప్రారంభంలోనే సెన్సెక్స్ 900 పాయింట్లు నష్టపోయింది. సెన్సెక్స్ 30 సూచీలోని కొన్ని ప్రముఖ కంపెనీల షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇవి ఇన్ఫోసిస్, ఏషియన్ పెయింట్స్, టాటా స్టీల్, ఎస్‌బీఐ, టెక్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, బజాజ్ ఫైనాన్స్ వంటి కంపెనీలు. కానీ, హెచ్‌యూఎల్, ఐటీ, సన్‌ఫార్మా షేర్లు మాత్రం లాభాల్లో ట్రేడవుతున్నాయి.
భారీగా క్షీణించిన అమెరికా మార్కెట్లు
అంతర్జాతీయ మార్కెట్ లో, బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 73.10 డాలర్ల వద్ద ట్రేడవుతోంది, బంగారం ఔన్సు ధర 2,622 డాలర్ల వద్ద ఉంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 85.06 వద్ద కొనసాగుతోంది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ కీలక రేట్లలో 25 బేసిస్ పాయింట్లు కోత విధించి,ప్రస్తుతం ఉన్న 4.50-4.75 శాతాన్ని 4.25-4.50 శాతానికి తగ్గించింది. ఇది ఉద్యోగ, ద్రవ్యోల్బణ గణాంకాల్లో వచ్చిన ప్రగతి నేపథ్యంలో జరిగింది.కానీ, భవిష్యత్తులో వడ్డీ రేట్లు ఇంకా తగ్గకపోవచ్చు అని ఫెడ్ బలమైన సంకేతాలు ఇచ్చింది. దీన్ని అనుసరించి, నిన్నటి ట్రేడింగ్ సెషన్‌లో అమెరికా మార్కెట్లు భారీగా క్షీణించాయి. డోజోన్స్ 2.58 శాతం, ఎస్ అండ్ పీ 2.95 శాతం, నాస్‌డాక్ 3.56 శాతం నష్టపోయాయి.
నష్టాల్లో ఆసియా-పసిఫిక్ మార్కెట్లు
యూఎస్ ఫెడ్ ఎఫెక్ట్ కారణంగా, ఆసియా-పసిఫిక్ మార్కెట్లు కూడా నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఆస్ట్రేలియా ఏఎస్‌ఎక్స్ 1.19 శాతం, జపాన్ నిక్కీ 0.96 శాతం, హాంకాంగ్ హాంగ్ సెంగ్ 1.01 శాతం, షాంఘై 0.72 శాతం నష్టాలను నమోదు చేశాయి. విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs) బుధవారం రూ.1,317 కోట్ల విలువైన షేర్లను విక్రయించగా, దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIs) నికరంగా రూ.4,084 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు.