GST council: బీమాపై GST తగ్గించే నిర్ణయం.. తదుపరి భేటీలోనే!
జీవిత, ఆరోగ్య బీమా పై జీఎస్టీ తగ్గింపు పై నిర్ణయం జీఎస్టీ కౌన్సిల్‌లో వాయిదా పడింది. ప్రస్తుతం ఉన్న 18 శాతం జీఎస్టీని తగ్గించేందుకు కౌన్సిల్‌లో ఏకాభిప్రాయం ఏర్పడినప్పటికీ, నిర్ణయం వచ్చే భేటీలో తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో జరిగిన 54వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో దీనిపై విస్తృతంగా చర్చ జరిగింది.
ఆధ్యాత్మిక ప్రదేశాల్లో హెలికాప్టర్ సేవలపై జీఎస్టీ తగ్గింపు
జీవిత, ఆరోగ్య, రీ ఇన్సూరెన్స్ ప్రీమియంలపై జీఎస్టీ తగ్గింపుకు సంబంధించిన లాభనష్టాలను ఫిట్‌మెంట్ కమిటీ కౌన్సిల్‌కు నివేదించింది. ఏకాభిప్రాయం ఏర్పడినప్పటికీ, తదుపరి సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. అదేవిధంగా, ఆధ్యాత్మిక ప్రదేశాల్లో హెలికాప్టర్ సేవలపై జీఎస్టీని 18 శాతం నుండి 5 శాతానికి తగ్గించడానికి కౌన్సిల్ నిర్ణయం తీసుకుందని సమాచారం. కౌన్సిల్ సమావేశం అనంతరం పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.