Page Loader
బడ్జెట్ 2023: మధ్యతరగతి వర్గంపై కొత్త పన్నులు విధంచలేదు: ఆర్థిక మంత్రి
మధ్యతరగతి వర్గంపై కొత్త పన్నులు విధంచలేదని చెప్పిన నిర్మలా సీతారామన్

బడ్జెట్ 2023: మధ్యతరగతి వర్గంపై కొత్త పన్నులు విధంచలేదు: ఆర్థిక మంత్రి

వ్రాసిన వారు Stalin
Jan 16, 2023
11:29 am

ఈ వార్తాకథనం ఏంటి

పార్లమెంట్‌ బడ్జెట్ సమావేశాలు మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) పత్రిక పాంచజన్య నిర్వహించిన కార్యక్రమంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను మధ్యతరగితికి చెందిన వ్యక్తినని, వారి ఆర్థిక బాధలను తాను అర్థం చేసుకోగలనని చెప్పారు నిర్మలా సీతారామన్. మోదీ ప్రభుత్వం ఇప్పటివరకు ఏ బడ్జెట్‌లోనూ ఏడాదికి రూ.5 లక్షల లోపు సంపాదిస్తున్న మధ్యతరగతిపై కొత్త పన్ను విధించలేదని మంత్రి చెప్పారు. స్మార్ట్ సిటీల నిర్మాణం, ఈజ్ ఆఫ్ లివింగ్‌ను ప్రోత్సహించడం, మధ్యతరగతి ప్రయాణాలను మరింత సులభతరం చేసేందుకు మెట్రో రైలు నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేయడం వంటి అనేక చర్యలపై కేంద్రం దృష్టి పెట్టినట్లు పేర్కొన్నారు.

బడ్జెట్

మోదీ ప్రభుత్వంలో భారత ఆర్థిక వ్యవస్థలో గణనీయమైన మార్పులు: నిర్మల

2020 నుంచి ప్రతి బడ్జెట్ సెషన్‌లోనూ కేంద్ర ప్రభుత్వం మూలధన వ్యయాలను పెంచుతోందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇది 35 శాతం పెరిగి రూ.7.5 లక్షల కోట్లకు చేరుకుందని ఆమె తెలిపారు. 2013లో ప్రపంచంలోనే ఐదు బలహీన ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఉండేదని నిర్మలా సీతారామన్ చెప్పారు. 2014లో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి భారతదేశ ఆర్థిక వ్యవస్థలో గణనీయమైన మార్పులు వచ్చినట్లు పేర్కొన్నారు. ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించిందని స్పష్టం చేశారు. డాలర్ మినహా ఇతర కరెన్సీలతో పోలిస్తే రూపాయి మారకపు విలువ బాగానే ఉందని వెల్లడించారు.