జనవరి 31నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు, ఏప్రిల్ 6న ముగింపు
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 31 నుంచి ప్రారంభమై ఏప్రిల్ 6వ తేదీ వరకు కొనసాగుతాయని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. మొత్త రెండు విడతల్లో సమావేశాలు నిర్వహించనున్నట్లు ప్రహ్లాద్ జోషి చెప్పారు. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 13వరకు తొలి విడత, మార్చి 13 నుంచి ఏప్రిల్ 6వతేదీ వరకు రెండో విడత సమావేశాలు ఉంటాయని వివరించారు. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీల డిమాండ్‌లను పరిశీలించడానికి, వారి మంత్రిత్వ శాఖలు/డిపార్ట్‌మెంట్‌లకు సంబంధించిన నివేదికలను రూపొందించడానికి వీలుగా ఫిబ్రవరి 14 నుంచి మార్చి 12 వరకు సమావేశాలకు విరామం ఇస్తున్నట్లు జోషి పేర్కొన్నారు.
బడ్జెట్ సమావేశాల కంటే ముందే.. కేంద్ర మంత్రివర్గ విస్తరణ!
అయితే బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో.. పలు బిల్లులపై ఉభయ సభల్లో చర్చించి.. వాటికి చట్ట రూపం ఇవ్వాలని కేంద్రం ప్రభుత్వం భావిస్తోంది. అయితే ప్రతిపక్షాలు మాత్రం కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను చట్ట సభల వేదికగా.. ఎండగట్టాలని చూస్తున్నాయి. ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) 2023లో మాంద్యం వస్తుందని హెచ్చరించడం, నిత్యావసరాల ధరలు పెరగడం, ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో నిర్వహిస్తున్న ఈ సమావేశాలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. 2023లో 9 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు.. 2024లో లోక్‌సభ ఎలక్షన్లు ఉన్న నేపథ్యంలో కేంద్ర మంత్రివర్గంలో భారీమార్పులు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే బడ్జెట్ సమావేశాలకు ముందే.. కేంద్రమంత్రి వర్గ విస్తరణ చేపట్టే అవకాశం ఉందనే తెలుస్తోంది.