PM e-DRIVE: రూ. 10,900 కోట్లతో పీఎం ఈ-డ్రైవ్ స్కీమ్‌ను ఆమోదించిన కేబినెట్
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్ మీటింగ్‌లో, దేశంలో విద్యుత్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు కీలక మార్పులు చేశారు. ఫేమ్ (FAME) పథకాన్ని రద్దు చేసి, రూ. 14,335 కోట్లతో రెండు కొత్త పథకాలకు ఆమోదం లభించింది. ఇందులో పీఎం ఎలక్ట్రిక్ డ్రైవ్ రెవెల్యూషన్ ఆన్ ఇన్నొవేటివ్ వెహికిల్ ఎన్‌హాన్స్‌మెంట్ (PM e-DRIVE) పథకానికి రూ. 10,900 కోట్లు కేటాయించారు. ఈ పథకం రెండు సంవత్సరాల పాటు అమలులో ఉంటుంది. మరొక పథకం, పీఎం-ఇ బస్ సేవా పేమెంట్ సెక్యూరిటీ మెకానిజం (PSM) పథకానికి రూ. 3435 కోట్లు కేటాయించారు.
28 లక్షల వాహనాలకు లబ్ధి చేకూరేలా పథకం
పీఎం ఇ-డ్రైవ్ పథకం కింద విద్యుత్ వాహనాలైన ద్విచక్ర, త్రిచక్ర వాహనాలు, అంబులెన్స్‌లు, ట్రక్స్ తదితరాలకు సబ్సిడీ కింద రూ. 3679 కోట్లు కేటాయించారు. మొత్తం 28 లక్షల వాహనాలకు లబ్ధి చేకూరేలా ఈ పథకం అమలవుతుంది. ఇందులో 24.79 లక్షల ద్విచక్ర వాహనాలు, 3.16 లక్షల త్రిచక్ర వాహనాలు, 14,028 ఇ-బస్సులు ఉంటాయి. ఇ-అంబులెన్స్‌ల ఏర్పాటుకు రూ. 500 కోట్లు, ఇ-ట్రక్స్ ప్రోత్సాహకానికి రూ. 500 కోట్లు, 14,028 ఇ-బస్సుల కొనుగోలుకు రూ. 4391 కోట్లు కేటాయించారు. వీటి వినియోగంపై హైదరాబాద్‌తో సహా 9 ప్రధాన నగరాల్లో CESL సంస్థ అధ్యయనం చేస్తుంది. పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు కోసం రూ. 2000 కోట్లు ఖర్చు చేయనున్నారు.
5 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్య సేవలు
ప్రజా రవాణా సంస్థలు (PTA) 12 సంవత్సరాల పాటు ఇ-బస్సులను నిర్వహించేందుకు రూ. 3435 కోట్లు కేటాయించారు. 2024-25 నుంచి 2028-29 మధ్య 38 వేల ఇ-బస్సులు రోడ్లపైకి రావడం కోసం ఈ నిధులు ఉపయోగిస్తారని కేంద్రం ప్రకటించింది. అదనంగా, కేంద్ర కేబినెట్ భారతదేశంలోని 70 సంవత్సరాలు పైబడిన సీనియర్ సిటిజెన్లందరికీ ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా పథకం వర్తింపజేయడాన్ని ఆమోదించింది. ఈ నిర్ణయం దాదాపు 6 కోట్ల మంది సీనియర్ సిటిజెన్లకు లబ్ధి కలిగిస్తుంది, వీరు ఏకంగా 5 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్య సేవలు పొందగలరు.