
Cash-On-Delivery: క్యాష్ ఆన్ డెలివరీ అదనపు ఛార్జీలపై కేంద్రం దర్యాప్తు ప్రారంభం
ఈ వార్తాకథనం ఏంటి
ఇటీవల ఆన్‌లైన్ షాపింగ్ వినియోగదారుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్న విషయం తెలిసిందే. దీంతో ఆన్‌లైన్ కొనుగోళ్ల వినియోగదారులకు 'పేమెంట్ ఆన్‌లైన్'తో పాటు క్యాష్ ఆన్ డెలివరీ (COD) సదుపాయం కూడా అందుతుంది. అయితే కొన్ని ఈ-కామర్స్ సంస్థలు COD కోసం అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు వినియోగదారుల ఫిర్యాదులు వెలుగులోకి వచ్చాయి. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషీ మాట్లాడుతూ అలాంటి సంస్థలపై దర్యాప్తు ప్రారంభించామన్నారు. సామాజిక మాధ్యమాల్లో ఓ యూజర్ ఈ-కామర్స్ కంపెనీలకు సంబంధించి స్పందించారు. వర్షాల సమయంలో ఫుడ్ డెలివరీ యాప్‌లు విధించే ఫీజులను పక్కన పెట్టండి. ఈ-కామర్స్ వేదికలు మరో షాక్ ఇస్తున్నాయి.
Details
ఇప్పటికే దర్యాప్తు ప్రారంభం
ఆఫర్ హ్యాండ్లింగ్ ఫీజులు(కంపెనీ ఇచ్చిన డిస్కౌంట్ల కోసం), పేమెంట్ హ్యాండ్లింగ్ ఫీజులు, ప్రొటెక్ట్ ప్రామిస్ ఫీజులు—ఇవన్నీ వసూలు చేస్తున్నారు. ఇకపై యాప్ స్క్రోల్ చేసినందుకు కూడా ఫీజులు వసూలు చేస్తారా అని అనిపిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఫిర్యాదులపై కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీ స్పందించారు. COD ఆప్షన్‌ను ఉపయోగించే వినియోగదారులపై కొన్ని ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లు అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయి. ఇది వినియోగదారులను తప్పుదారిలోకి నెట్టే, దోపిడీ చేసే చీకటి విధానం. దానిపై ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించాం. అలాంటి ప్లాట్‌ఫామ్‌లను గుర్తించి, వాటిపై కఠిన చర్యలు తీసుకుంటాం. భారత్‌లో వేగంగా విస్తరిస్తున్న ఈ-కామర్స్ రంగంలో పారదర్శకత, న్యాయమైన విధానాలను కొనసాగించడానికి కేంద్రం కృతనిశ్చయంగా ఉందని తెలిపారు.