zero for zero: అమెరికా ప్రతీకార సుంకాలకు చెక్!.. భారత్ 'సున్నా వ్యూహం'
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడు ప్రతీకార సుంకాలను అమలు చేయనున్న నేపథ్యంలో భారత్ దీనిని సమర్థంగా ఎదుర్కొనేందుకు 'సున్నాకు సున్నా' టారిఫ్ వ్యూహాన్ని అనుసరించాలని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనీషియేటివ్ (జీటీఆర్‌ఐ) సూచించింది.
ఇది పూర్తి స్థాయి ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కంటే మెరుగైన మార్గమని ఈ సంస్థ తాజా నివేదికలో వెల్లడించింది.
ఈ వ్యూహంలో భాగంగా, ప్రభుత్వం కొన్ని టారిఫ్ లైన్లు లేదా ఉత్పత్తి విభాగాలను గుర్తించి, అమెరికా నుంచి వచ్చే కొన్ని వస్తువులపై దిగుమతి సుంకాన్ని ఎత్తివేయాలి.
ఇదే సమయంలో దేశీయ పరిశ్రమలకు, వ్యవసాయానికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడాలి.
భారత్ అమెరికాకు ఎగుమతి చేసే నిర్దిష్ట వస్తువులపైనా అక్కడి ప్రభుత్వం సుంకాన్ని తొలగించేలా ప్రతిపాదన చేయాలి.
Details
మన ఉత్పత్తులపై భారీ సుంకాలు పడకుండా నివారించవచ్చు
ముఖ్యంగా వ్యవసాయ ఉత్పత్తులను మినహాయించి, పారిశ్రామిక ఉత్పత్తులపై టారిఫ్‌లను తగ్గించడం వల్ల మన ఉత్పత్తులపై భారీ సుంకాలు పడకుండా నివారించవచ్చు.
ఈ వ్యూహాన్ని త్వరగా అమలు చేసి, అమెరికా ఏప్రిల్‌లో ప్రతీకార సుంకాలను అమలు చేసేలోగా చర్చలు జరిపితే మంచిదని జీటీఆర్‌ఐ వ్యవస్థాపకుడు అజయ్ శ్రీవాస్తవ పేర్కొన్నారు.
ట్రంప్ ప్రతిస్పందన ఎలా ఉంటే?
భారత్ ప్రతిపాదనను ట్రంప్ తిరస్కరిస్తే, అసలు సమస్య టారిఫ్‌లు కాదని స్పష్టమవుతుంది. అప్పుడు ఇతర రంగాల్లో మినహాయింపులకు ఒత్తిడి చేయడం భారత్‌కు లాభదాయకమని సూచించారు.
చైనా అనుసరించిన విధానాలను పరిగణనలోకి తీసుకుని, అనవసరమైన డిమాండ్లను గట్టిగా తిరస్కరించడమే ఉత్తమమని ఈ నివేదిక పేర్కొంది.
Details
టారిఫ్‌ల తగ్గింపు - భారత్‌కు మేలే!
నీతి ఆయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యం ప్రకారం, ఏ దేశాన్ని టారిఫ్‌లు రక్షించలేవు. కాబట్టి, భారత్ తన ప్రయోజనాల కోసమైనా దిగుమతులపై సుంకాలను తగ్గించాలి.
అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే, వాణిజ్య ఒప్పందాలను పూర్తిచేసి, అంతర్జాతీయ సరఫరా వ్యవస్థలో భారత్ కీలకంగా మారాలని సూచించారు.
ఉక్కు దిగుమతులపై త్వరలో సుంకం విధింపు
దేశీయ పరిశ్రమలను రక్షించేందుకు ఉక్కు దిగుమతులపై సుంకం విధించనుందని టాటా స్టీల్ సీఈఓ టీవీ నరేంద్రన్ తెలిపారు.
పెరుగుతున్న దిగుమతుల వల్ల దేశీయ ఉక్కు పరిశ్రమలో పెట్టుబడులు ఆగిపోతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రేడ్ రెమిడీస్ (డీజీటీఆర్)కు ఇండియన్ స్టీల్ అసోసియేషన్ (ఐఎస్‌ఏ) ఈ విషయంలో విజ్ఞప్తి చేసిందన్నారు.
Details
స్టాక్ మార్కెట్ ప్రభావం
ఉక్కు దిగుమతులపై సుంకాలు విధిస్తారనే అంచనాలతో నిఫ్టీ లోహ సూచీ లాభాలను సాధించింది.
టాటా స్టీల్ 1.85%, ఎన్‌ఎమ్‌డీసీ 0.42%, సెయిల్ 2.6% లాభపడ్డాయి.
ఐదు రోజులుగా నిఫ్టీ లోహ సూచీ పెరుగుతూ వస్తుండడం విశేషం. ఈ వ్యూహంతో, అమెరికా ప్రతీకార సుంకాలను సమర్థంగా ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధంగా ఉంది.