చమురు దిగుమతుల చెల్లింపులపై రష్యా పేచీ.. నో చెప్పిన భారత్
రష్యా వద్ద భారత్ కొనుగోలు చేసిన చమురు దిగుమతులపై మిత్రదేశం రష్యా పేచీ పెట్టింది. ఈ మేరకు భారత కరెన్సీలో కాకుండా చైనా యువాన్ కరెన్సీలో చెల్లింపులు చేపట్టాలని కోరింది. దీనిపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం ఇందుకు ససేమిరా అని చెప్పింది. ఉక్రెయిన్ -రష్యా యుద్ధం కారణంగా రష్యన్ చమురుకు అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ పడిపోయింది. అయితే రష్యా మనుగడ కోసం ఈ చమురును మిత్ర దేశాలకు చౌకగా అమ్మేందుకు నిర్ణయించగా, దీన్ని భారత్ అందిపుచ్చుకుంది. మరోవైపు పశ్చిమ దేశాల హెచ్చరికలను సైతం భారత్ ఖాతరు చేయలేదు. దేశ ప్రయోజనాలే లక్ష్యంగా రష్యా నుంచి చౌకగా చమురు దిగుమతి చేసుకుంటోంది. అంతా బాగానే ఉన్నా, ఈ దిగుమతిలో కరెన్సీ సమస్య వచ్చిపడింది.
చైనా కరెన్సీని కోరుతున్న రష్యా
భారీ మొత్తంలో పోగవుతున్న ఇండియన్ రూపాయిపై రష్యా మడతపేచీ పెట్టింది. భారత కరెన్సీని ఎలా ఖర్చు పెట్టాలి, ఏ మేరకు వినియోగించుకోవాలో మిత్రదేశానికి తెలియట్లేదు. అంతర్జాతీయ భౌగోళిక రాజకీయాల్లో భారత్, రష్యా మిత్రదేశాలుగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాయి.ఇదే సమయంలో రష్యా, చైనా సన్నిహిత దేశాలుగా మసులుకుంటున్నాయి. ఉక్రెయిన్ పై యుద్ధం కారణంగా రష్యాని పశ్చిమ దేశాలు, అంతర్జాతీయ సమాజం దూరం పెట్టాయి. కానీ చైనా మాత్రం ఆ దేశానికి స్నేహం కోసం అర్రులు చాస్తోంది. చైనా నుంచి ప్రస్తుతం రష్యాకు అత్యధిక దిగుమతులన్నాయి.ఈ క్రమంలోనే యువాన్ లో లావాదేవీలు చేయాలని రష్యా అడుగుతోంది. కానీ ఈ ప్రతిపాదనలను భారత్ తిరస్కరించడం గమనార్హం.