
Gold Record Price: చైనా-అమెరికా వాణిజ్య ఉద్రిక్తతలు.. భగ్గుమున్న బంగారం ధరలు
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న కొన్ని కీలక ఆర్థిక నిర్ణయాల ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు ఎగబాకుతున్నాయి.
ఈ పరిణామం కేవలం భారత్‌కే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో గోల్డ్ మార్కెట్‌ను ప్రభావితం చేస్తోంది.
తాజా ట్రెండ్ చూస్తే బంగారం ధరలు చరిత్రలో ఎన్నడూ లేనంతగా పెరిగాయి.
ప్రస్తుతం బంగారానికి గోల్డెన్ డేస్ వచ్చినట్టే కనిపిస్తోంది. ఏప్రిల్ 21న స్పాట్ గోల్డ్ ధర ఒక్కసారిగా 1.7 శాతం పెరిగి ఔన్స్‌కి $3,383.87 స్థాయికి చేరుకుంది.
మునుపటి సెషన్‌లో ఇది $3,384 స్థాయిని తాకింది. ఇది ఆల్‌టైమ్ రికార్డ్. ఈ పెరుగుదలతో బంగారంలో పెట్టుబడి పెట్టిన వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
అయితే తాజాగా కొనుగోలు చేయాలనుకుంటున్నవారికి ఈ రేట్లు షాక్‌నివ్వడం ఖాయం.
Details
భారత్‌పై ప్రభావం
అంతర్జాతీయ ధరల ప్రభావంతో భారత్‌లోనూ గోల్డ్ రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి. గుడ్‌రిటర్న్స్ డేటా ప్రకారం, ఏప్రిల్ 21న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.98,350కి చేరింది.
నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ పెరుగుదల కొనసాగితే బంగారం ధరలు ఈ వారంలోనే లక్ష రూపాయల మార్క్‌ను దాటే అవకాశముంది.
దీంతో కొనుగోలు పై యోచిస్తున్నవారు కొంత ఆలస్యం చేసే సూచనలు కనిపిస్తున్నాయి.
Details
ధరల పెరుగుదలకు కారణాలు
బంగారం రేట్ల పెరుగుదల వెనుక పలు ఆర్థిక, రాజకీయ కారణాలున్నాయని నిపుణులు చెబుతున్నారు.
అమెరికా డాలర్ బలహీనత, ట్రంప్ విధించిన సుంకాలు, ఫెడరల్ రిజర్వ్‌తో జరుగుతున్న ఉద్రిక్తతలు మొదలైనవి ప్రధానంగా చెప్పుకోవచ్చు.
ట్రంప్ చైనాపై 145 శాతం వరకు సుంకాలు విధించగా, ప్రపంచవ్యాప్తంగా 10 శాతం టారిఫ్‌లను అమలు చేసింది.
చైనా - అమెరికా వాణిజ్య చర్చలు
గత వారం ట్రంప్ చైనాతో వాణిజ్య చర్చలు కొనసాగుతున్నాయని తెలిపారు. వాణిజ్య యుద్ధానికి తెరపడే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. చైనా కూడా ప్రపంచ వాణిజ్య సంస్థకు అమెరికాపై ఫిర్యాదు చేసింది.
ఈ చర్చలు ఎప్పుడు ఫలితాలందిస్తాయి? బంగారం ధరలు ఎప్పుడు కూలుతాయి? అనే ప్రశ్నలు కొనుగోలుదారుల మనసుల్లో ఇంకా మిగిలే ఉన్నాయి.