
GST 2.0: పొగాకు, గుట్కా, ఫాస్ట్‌ఫుడ్ అభిమానులకు షాక్.. ఇక 40% పన్ను భారం!
ఈ వార్తాకథనం ఏంటి
జీఎస్టీ కౌన్సిల్ ఇటీవల జరిగిన సమావేశంలో వినియోగదారులను నేరుగా ప్రభావితం చేసే కీలక నిర్ణయాలు వెలువడ్డాయి. కొన్ని వస్తువులపై పన్ను తగ్గించగా, మరికొన్నింటిపై మాత్రం భారీగా పెంచింది. ముఖ్యంగా సిగరెట్లు, గుట్కా, పాన్ మసాలా సహా అన్ని రకాల పొగాకు ఉత్పత్తులపై జీఎస్టీ రేటు 28% నుండి నేరుగా 40%కి పెంచింది. ఈ కొత్త రేట్లు 2025 సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి రానున్నాయి. పొగాకు ఉత్పత్తులతో పాటు లగ్జరీ కార్లు, ఫాస్ట్ ఫుడ్, చక్కెర పానీయాలకూ 40% పన్ను విధించనుంది. అంటే వీటి ధరలు ఇక మరింత పెరగడం ఖాయం.
వివరాలు
సిగరెట్లు, పాన్ మసాలాల ధరల పెరుగుదల స్పష్టమే
ప్రభుత్వ నిర్ణయం వల్ల పొగాకు ఉత్పత్తులు వాడేవారి ఖర్చు మరింత పెరుగుతుంది. ఉదాహరణకు.. ప్రస్తుతం రూ. 256కి దొరికే సిగరెట్ ప్యాకెట్ కొత్త పన్ను రేట్లు అమల్లోకి రాగానే దాదాపు రూ. 280 అవుతుంది. అంటే ఒక్కసారిగా రూ. 24 అదనంగా చెల్లించాల్సి వస్తుంది. ఇదే విధంగా గుట్కా, జర్దా, నమిలే పొగాకు, పాన్ మసాలా ధరలు కూడా బాగా పెరగనున్నాయి. ఇప్పటికే వీటిపై సెస్, ఇతర పన్నులు ఉన్నందున వినియోగదారుల జేబులకు మరింత భారమవుతుంది.
వివరాలు
ఫాస్ట్‌ఫుడ్ నుంచి లగ్జరీ కార్ల వరకూ కొత్త పన్ను
ప్రభుత్వం పొగాకు ఉత్పత్తులతో పాటు మరికొన్ని వస్తువులను కూడా 40% జీఎస్టీ కేటగిరీలోకి చేర్చింది. వాటిలో ముఖ్యంగా: ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ రుచిగల చక్కెర పానీయాలు, కార్బోనేటెడ్ డ్రింక్స్ సూపర్ లగ్జరీ కార్లు, వ్యక్తిగత విమానాలు జర్దా, అధిక చక్కెర ఉత్పత్తులు ఈ మార్పుతో విలాస వస్తువుల వర్గంలోకి ఇవన్నీ చేరాయి.
వివరాలు
పన్ను లెక్కింపు విధానంలో మార్పు
ఇప్పటి వరకు ఈ ఉత్పత్తులపై పన్ను వాటి లావాదేవీ విలువ (transaction value) ఆధారంగా లెక్కించబడేది. కానీ కొత్త నియమాల ప్రకారం ఇకపై రిటైల్ సేల్ ప్రైస్ (RSP) ఆధారంగా పన్ను వసూలు చేస్తారు. దీంతో పన్ను ఎగవేతకు అవకాశం లేకుండా కంపెనీలను కట్టడి చేయగలమని ప్రభుత్వం చెబుతోంది. అలాగే సెస్‌కు సంబంధించిన పాత బకాయిలు చెల్లించకపోతే ఈ ఉత్పత్తులపై ఎలాంటి ఉపశమనం ఉండదని స్పష్టం చేసింది. ఆరోగ్యం-పర్యావరణం దృష్ట్యా నిర్ణయం పొగాకు, జంక్ ఫుడ్, తీపి పానీయాలు వంటి ఉత్పత్తులు ఆరోగ్యానికి హానికరమే కాక పర్యావరణంపై కూడా చెడు ప్రభావం చూపుతున్నాయని కేంద్రం భావిస్తోంది. వాటి వినియోగాన్ని తగ్గించడానికి, నియంత్రించడానికి పన్ను భారాన్ని పెంచినట్టు అధికారులు తెలిపారు.
వివరాలు
జీఎస్టీ శ్లాబుల్లో మార్పు
అదే సమయంలో పన్ను విధానాన్ని సరళతరం చేసే దిశగా జీఎస్టీ కౌన్సిల్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఉన్న 12%, 28% శ్లాబులను రద్దు చేసింది. ఇక చాలా వస్తువులు 5% లేదా 18% పన్ను శ్రేణిలోకి వస్తాయి. దీని వల్ల మధ్యతరగతి ప్రజలకు కొన్నివస్తువులు తక్కువ ధరలో దొరకే అవకాశం ఉంది. ఈ మార్పులు ఒకవైపు ప్రభుత్వానికి ఆదాయం పెంచుతాయి. మరోవైపు పొగాకు, ఫాస్ట్‌ఫుడ్, చక్కెర పానీయాల వంటి అనారోగ్యకర వస్తువుల వినియోగాన్ని తగ్గించే దిశగా ఉపయోగపడతాయి.