Page Loader
Ap Daikin AC : శ్రీసిటీలో డైకిన్‌ ఏసీ తయారీ పరిశ్రమ ప్రారంభం
శ్రీసిటీలో డైకిన్‌ ఏసీ తయారీ పరిశ్రమ ప్రారంభం

Ap Daikin AC : శ్రీసిటీలో డైకిన్‌ ఏసీ తయారీ పరిశ్రమ ప్రారంభం

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Nov 24, 2023
04:08 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్'లోని శ్రీసిటీలో డైకిన్ ఏసీ తయారీ ప్లాంటును ఆ సంస్థ ఛైర్మన్ కన్వల్‌జిత్‌ జావా ప్రారంభించారు. జపాన్‌కు చెందిన ఎయిర్‌ కండిషనింగ్‌ (AC) తయారీ కంపెనీ డైకిన్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (DIL) అనుబంధ సంస్థ డైకిన్‌ ఎయిర్‌ కండిషనింగ్‌ ఇండియా ప్రై.లి. గురువారం అధునాతన తయారీ ప్లాంటును ప్రారంభించింది. 75.5 ఎకరాల విస్తీర్ణంలో దాదాపు రూ.1,000 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసిన ఈ ప్లాంటులో ఏసీ యూనిట్లతో పాటు కంప్రెషర్లు, కంట్రోలర్‌ బోర్డులు, విడిభాగాలను తయారు చేస్తామని కంపెనీ ప్రకటించింది. దేశీయ మార్కెట్ సహా విదేశాలకు ఎగుమతి చేసేందుకు వీలుగా, ఏడాదికి 15 లక్షల యూనిట్లను ఉత్పత్తి చేస్తామని డీఐఎల్‌ సీఈఓ, ప్రెసిడెంట్‌ మసనోరి తోగావా వెల్లడించారు.

details

ఇక్కడ్నుంచే దేశీయంతో పాటు విదేశాలకూ ఎగుమతి

భారతదేశంలో డైకిన్ కంపెనీకి ఇది మూడో ఉత్పత్తి కేంద్రంగా గుర్తింపు పొందింది. ఆగ్నేయాసియాలోనే శ్రీసిటీ ప్లాంట్ అతిపెద్దదని తోగావా తెలిపారు. పశ్చిమ ఆఫ్రికా, శ్రీలంక, భూటాన్‌, నేపాల్‌, బంగ్లాదేశ్‌, మధ్యప్రాచ్యం, దక్షిణ అమెరికా, తూర్పు ఆఫ్రికా దేశాలకు ఇక్కడ నుంచే ఏసీలను ఎగుమతి చేస్తామని డైకిన్‌ ఇండియా ఛైర్మన్‌, ఎండీ కన్వల్‌జిత్‌ జావా అన్నారు. ప్రధాన ఏసీ బ్రాండ్లలో అధిక తయారీ కారణంగా దేశానికి 'కూల్‌ క్యాపిటల్‌'గా శ్రీసిటీ అవతరిస్తోందని శ్రీసిటీ ఎండీ రవీంద్ర సన్నారెడ్డి తెలిపారు. జపాన్‌ కాన్సుల్‌ జనరల్‌ మసయుకి టాగా, ఇన్వెస్ట్‌ ఇండియా ఎండీ, సీఈఓ నివృతి రాయ్‌, జపాన్‌లోని భారత మాజీ రాయబారి సుజన్‌ చినోయ్‌, శ్రీసిటీ ఎండీ రవీంద్ర సన్నారెడ్డితో కలిసి ఛైర్మన్ ప్లాంట్ ప్రారంభించారు.