
Zomato: ప్రైవేట్ జెట్ రంగంలోకి జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్ .. బాంబర్డియర్ లగ్జరీ జెట్ కొనుగోలు
ఈ వార్తాకథనం ఏంటి
జొమాటో (Zomato) మాతృ సంస్థ అయిన ఎటర్నల్ వ్యవస్థాపకుడు,సీఈఓ దీపిందర్ గోయల్ పౌర విమానయాన రంగంలోకి ప్రవేశించేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే ఆయన 'ఎల్‌ఏటీ ఏరోస్పేస్' అనే పేరుతో ఏవియేషన్ వ్యాపారాన్ని ప్రారంభించారు. తాజాగా ఓ ప్రైవేట్ జెట్ కొనుగోలు చేసినట్లు సమాచారం. బాంబర్డియర్ గ్లోబల్ సిరీస్‌కు చెందిన లగ్జరీ ప్రైవేట్ జెట్‌ను ఎల్‌ఏటీ ఏరోస్పేస్ సంస్థ కొనుగోలు చేసినట్లు ఆంగ్ల మీడియా కథనాలు తెలియజేశాయి. ఈ బాంబర్డియర్ లగ్జరీ విమానం ఈ ఏడాది జూన్ నెల నుంచి ఢిల్లీ ఎయిర్‌పోర్టులోని వీఐపీ బే వద్ద నిలిపి ఉంచినట్లు తెలుస్తోంది. జూలై 16నుంచి ఈ జెట్ కార్యకలాపాలు ప్రారంభం కానున్నట్లు వార్తలలో పేర్కొన్నారు.
వివరాలు
దీపిందర్ గోయల్ ఇటీవలే డీఎల్‌ఎఫ్ ప్రాంతంలో అపార్ట్‌మెంట్ కొనుగోలు
ఈ ప్రైవేట్ జెట్ నిర్వహణ, ఇంజినీరింగ్ సేవల బాధ్యతలను ఇందమెర్ ఎంజెట్స్ ఎయిర్‌పోర్ట్ సర్వీసెస్,బర్డ్ ఎగ్జిక్యూజెట్ ఎయిర్‌పోర్ట్ సర్వీసెస్ అనే కంపెనీలకు అప్పగించినట్లు సమాచారం. అయితే, కొనుగోలు చేసిన ప్రైవేట్ జెట్ మోడల్, ఇతర లక్షణాల వివరాలు ఇప్పటి వరకు బహిర్గతం కాలేదు. దీపిందర్ గోయల్ ఇటీవలే ఓ విలాసవంతమైన అపార్ట్‌మెంట్‌ను సొంతం చేసుకున్న విషయం కూడా ప్రస్తావించాల్సిందే. గురుగ్రామ్‌లోని డీఎల్‌ఎఫ్ ప్రాంతంలో ఉన్న ఈ అపార్ట్‌మెంట్‌ను రూ.52.3కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం. ఫోర్బ్స్ నివేదిక ప్రకారం,ఈ ఏడాది జూన్ నాటికి దీపిందర్ గోయల్‌కు జొమాటోలో 3.83శాతం వాటాలు ఉన్నాయి. ప్రస్తుతం వాటి మార్కెట్ విలువ రూ.9,847కోట్లు.ఫోర్బ్స్ లెక్కల ప్రకారం దీపిందర్ గోయల్ నికర సంపద 1.6బిలియన్ డాలర్లకు పైగానే ఉన్నట్లు వెల్లడించారు.