Dell Work From Office: వర్క్ ఫ్రమ్ హోంకి డెల్ గుడ్ బై..వారానికి 5 రోజులు ఆఫీస్ నుంచే పని..
ప్రపంచవ్యాప్తంగా సంస్థలు వర్క్ ఫ్రమ్ హోమ్ సంస్కృతికి ముగింపు పలుకుతున్నాయి. టెక్ దిగ్గజం డెల్, సెప్టెంబరు 30 నుండి తమ సేల్స్ టీమ్ ఉద్యోగులను ఆఫీస్‌లకు రావాలని ఆదేశించింది. వారానికి ఐదు రోజుల పాటు ఆఫీస్ నుండి పనిచేయాలని డెల్ ఉద్యోగులకు కోరిందని రాయిటర్స్ తెలిపింది. ఉద్యోగులకు సహకార వాతావరణం సృష్టించడం, నైపుణ్యాలను అభివృద్ధి చేసేందుకు ఈ మార్పు చేయబడుతున్నదని డెల్ ప్రకటించింది. అందుకు టీమ్ ఆఫీస్‌లో ఉండాల్సిన అవసరం ఉందని మెమోలో పేర్కొనబడింది."రిమోట్‌గా పని చేయడం అన్నది మినహాయింపుగా ఉండాలి. రొటీన్ కాకూడదు" అని జోడించింది.
గతంలో వారానికి మూడు రోజులు కార్యాలయం నుండి పని
మెమో ప్రకారం, సేల్స్ టీమ్‌లో ఫీల్డ్ ప్రతినిధులు వారానికి ఐదు రోజుల పాటు కస్టమర్‌లు, భాగస్వాములతో లేదా కార్యాలయంలో పనిచేయాలి. గతంలో, వీరు వారానికి మూడు రోజుల పాటు ఆఫీస్ నుంచి పని చేసేవారు. ఆఫీస్‌కు రాలేని సేల్స్ టీమ్ సభ్యులు రిమోట్‌గా పని చేయవచ్చని డెల్ తెలిపింది. కోవిడ్ మహమ్మారి సమయంలో, చాలా కంపెనీలు ఉద్యోగులను ఇంటి నుండి పని చేయడానికి అనుమతించాయి. అయితే, కొన్ని టెక్ సంస్థలు, ప్రస్తుతం వారానికి రెండు నుండి మూడు రోజులు ఆఫీస్‌ల నుంచి పనిచేయిస్తున్నాయి. వచ్చే ఏడాది నుండి వారానికి ఐదు రోజుల పాటు కంపెనీ కార్యాలయాలలో పనిచేయాలని, గత వారం, ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ తమ ఉద్యోగులకు ఆదేశాలు జారీ చేసింది.