ఎయిర్ ఇండియాపై కొరడా ఝులిపించిన డీజీసీఏ.. భద్రతా విభాగాధిపతిపై సస్పెన్షన్
ఎయిర్ ఇండియా మరోసారి డీజీసీఏ ఆగ్రహానికి గురైంది. ప్రయాణికుల భద్రత అంశంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్, కఠిన చర్యలకు ఉప్రకమించింది. ఈ మేరకు సంస్థ భద్రతా విభాగాధిపతిపై నెలరోజుల పాటు సస్పెన్షన్ విధించింది. జులై 25 నుంచి 26 మధ్య ఎయిర్ ఇండియాలో DGCA తనిఖీలు నిర్వహించింది. అంతర్గత ఆడిట్, ప్రమాద నివారణ, సరిపడ సాంకేతిక నిపుణుల అంశాలను పర్యవేక్షించినట్లు వెల్లడించింది. ఈ క్రమంలోనే ప్రమాదాల నివారణ అంశంలో డీజీసీఏ పలు లోపాలను గుర్తించింది. సాంకేతిక నిపుణులు సైతం తగిన సంఖ్యలో లేరని, ఇది నియమ నిబంధనల ఉల్లంఘనేనని పేర్కొంది. దీనిపై షోకాజ్ నోటీసులు జారీ చేశామని, అనంతరం ముఖ్యభద్రతా అధికారిపై నెలరోజుల సస్పెన్షన్ విధించామని స్పష్టం చేసింది.