ఎయిర్ ఇండియా అధికారిపై దాడి; ఫోన్ మెల్లగా మాట్లాడమంటే చేయిచేసుకున్న ప్రయాణికుడు
ఎయిర్ ఇండియా అంటేనే వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. ఈ మధ్య కాలంలో ఈ సంస్థకు చెందిన ఫ్లైట్లు తరచుగా వార్తల్లో నిలుస్తున్నాయి. తాజాగా ఎయిర్ ఇండియాకు సంబంధించిన మరో వివాదం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన జులై 9న జరగ్గా ఆలస్యంగా బయటకు వచ్చింది. ఆస్ట్రేలియాలోని సిడ్నీ నుంచి దిల్లీ వస్తున్న ఎయిర్ ఇండియా ఫ్లైట్‌లో ఓ ప్రయాణికుడు కలకలం సృష్టించాడు. సంస్థకు చెందిన ఓ సీనియర్ అధికారిపై చేయిచేసుకున్నాడు. విమానంలో ఫోన్ మెల్లగా మాట్లాడుకోవాలని సూచించిన కారణంగా అధికారి చెంప చెల్లుమనిపించాడు. అనంతరం సిబ్బంది సహా తోటి ప్రయాణికులపై చిందులు తొక్కాడు. అప్రమత్తమైన సిబ్బంది, అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఫ్లైట్ దిల్లీలో ల్యాండ్ అయ్యాక అతన్ని భద్రతా సిబ్బందికి అప్పగించారు.
దుష్ప్రవర్తనపై కఠినంగా వ్యవహరిస్తాం: ఎయిర్ ఇండియా
ఈ విషయంపై ఏవియేషన్ రెగ్యులేటర్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ)కి సమాచారం అందించామని ఎయిర్ ఇండియా అధికార ప్రతినిధి తెలిపారు. అలాగే దాడి జరిగినట్లు ధృవీకరించారు.