ఎయిర్‌ఇండియా విమానంలో మరో వివాదం..ఫ్లైట్ గాల్లో ఉండగానే ప్రయాణికుడి మూత్ర విసర్జన
ఎయిర్ ఇండియా విమానంలో ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడు. దేశీయ వాయు మార్గంలో ముంబై నుంచి దిల్లీ వెళ్తున్న విమానం, గాల్లో ఉండగానే ఓ ప్రయాణికుడు విచక్షణ కోల్పోయి సీట్లోనే మూత్ర విసర్జన కలకలం సృష్టించింది. విమానం ఏఐసీ 866లో జూన్ 24న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాంసింగ్ అనే ప్రయాణికుడు 17 ఎఫ్ సీటులోనే మూత్రాన్ని విసర్జించాడు. అనంతరం సీట్ వద్దే ఉమ్మేశాడు. దీంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. సమాచారం అందుకున్న ఫ్లైట్ క్రూ సిబ్బంది, రాంసింగ్ ను మందలించారు. అనంతరం తోటి ప్రయాణికులకు అతన్ని దూరంగా కూర్చోబెట్టారు.
గతంలో ప్రయాణికురాలు కప్పుకున్న దుప్పటిపై మూత్ర విసర్జన
విమానం దిల్లీలో ల్యాండింగ్ అయ్యాక సెక్యూరిటీ సిబ్బంది ప్రయాణికుడ్ని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిపై అసభ్యకర ప్రవర్తన, బహిరంగ ప్రదేశంలో మద్యం మత్తులో ఇబ్బందులకు గురిచేసిన కేసులను పోలీసులు నమోదు చేశారు. గత ఏడాది నవంబర్ 22న న్యూయార్క్ నుంచి దిల్లీ వస్తున్న ఎయిర్ ఇండియా విమానంలోనూ ఓ ప్రయాణికుడు మద్యం మత్తులో తోటి ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన చేయడం పెద్ద దుమారాన్నే రేపింది. పారిస్ - దిల్లీ ఫ్లైట్ లోనూ మద్యం మత్తులో ఉన్న ఓ ప్రయాణికుడు, తోటి ప్రయాణికురాలు కప్పుకున్న దుప్పటిపై మూత్ర విసర్జన దుశ్చర్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనలు మరువకముందే తాజాగా ఇదే కంపెనీకి చెందిన విమానంలో పాత ఘటనలే పువరావృతమవడం చర్చనీయాంశమైంది.