ప్రత్యక్ష పన్ను వసూళ్లలో 21.8 శాతం పెరుగుదల.. రూ. 9.57 లక్షల కోట్ల ప్రత్యక్ష పన్ను వసూళ్లు
భారతదేశంలో ప్రత్యక్ష పన్ను వసూళ్లు 21.82 శాతం పెరిగాయి. ఈ మేరకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(FY 2023-24)లో అక్టోబర్ 9 వరకు 9.57 లక్షల కోట్లకు చేరుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కార్పొరేట్, వ్యక్తిగత ఆదాయపు పన్ను వసూళ్ల రాబడే దీనికి కారణమని కేంద్ర ఆర్థిక శాఖ మంగళవారం వెల్లడించింది. పూర్తి సంవత్సరానికి బడ్జెట్ అంచనా రూ.18.23 లక్షల కోట్లలో ప్రస్తుత రాబడి 52.5 శాతానికి చేరుకోవడం గమనార్హం. మరోవైపు ఏప్రిల్ 1 నుంచి అక్టోబర్ 9 వరకు స్థూల ప్రత్యక్ష పన్ను వసూళ్లు 17.95 శాతం మేర పెరిగి రూ.11.07 లక్షల కోట్లకు చేరుకున్నట్లు సదరు మంత్రిత్వ శాఖ వివరించింది.
29.53 శాతంగా దూసుకెళ్తున్న వ్యక్తిగత ఆదాయ పన్ను వసూళ్లు
ఇక ఆర్థిక కార్యకలాపాలు పుంజుకోవడం మూలానా స్థూల ఆదాయ వసూళ్ల పరంగా కార్పొరేట్ ఆదాయ పన్ను 7.30 శాతం, వ్యక్తిగత ఆదాయ పన్ను వసూళ్లు 29.53 శాతంగా దూసుకెళ్తున్నాయి. ఏప్రిల్ నుంచి అక్టోబర్ 9 వరకు రూ. 1.50 లక్షల కోట్ల రీఫండ్‌లున్నాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. FY 2023-24 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో ప్రత్యక్ష పన్ను(DIRECT TAXES) వసూళ్ల లక్ష్యం రూ. 18.23 లక్షల కోట్లుగా అంచనా. గత FY రూ. 16.61 లక్షల కోట్ల కంటే ఇది 9.75 శాతం ఎక్కువే. ఈ నేపథ్యంలోనే నికర ప్రత్యక్ష పన్నుల వసూళ్లు అక్టోబర్ 9 వరకు 21.82 శాతం పుంజుకుని రూ.9.57 లక్షల కోట్లకు చేరుకోవడం గమనార్హం.