Page Loader
Donald Trump: 'భారత్‌కు ప్లాంట్లను తరలించొద్దు'.. ఆపిల్ సీఈవో టిమ్‌ కుక్‌తో ట్రంప్‌ కీలక భేటీ 
'భారత్‌కు ప్లాంట్లను తరలించొద్దు'.. ఆపిల్ సీఈవో టిమ్‌ కుక్‌తో ట్రంప్‌ కీలక భేటీ

Donald Trump: 'భారత్‌కు ప్లాంట్లను తరలించొద్దు'.. ఆపిల్ సీఈవో టిమ్‌ కుక్‌తో ట్రంప్‌ కీలక భేటీ 

వ్రాసిన వారు Sirish Praharaju
May 15, 2025
02:48 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆపిల్ తయారీ యూనిట్లు భారత్‌కు బదలాయించబడతాయన్న అంచనాలకు తీవ్ర నిరాశే ఎదురవుతుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ స్వయంగా ఆపిల్ సీఈఓ టిమ్ కుక్‌ను సంప్రదించి, తన అభిప్రాయాన్ని తెలియజేశారు. ఈ విషయాన్ని స్వయంగా ట్రంప్ వెల్లడించారు. ''నిన్న నాకు టిమ్ కుక్‌తో చిన్న వివాదం తలెత్తింది. అతను భారత్‌లో తయారీ ప్లాంట్లు నెలకొల్పుతున్నట్టు తెలిపాడు. అయితే ఆ నిర్ణయం నాకు నచ్చలేదని చెప్పాను. దాంతో అమెరికాలోనే ఉత్పత్తిని విస్తరించేందుకు యాపిల్ అంగీకరించింది,'' అని ట్రంప్ పేర్కొన్నారు. ఖతార్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమం సందర్భంగా ట్రంప్, టిమ్ కుక్‌ల మధ్య సమావేశం జరిగింది.

వివరాలు 

చైనా-అమెరికా మధ్య ఉద్రిక్తతలతో భారత్‌పై దృష్టి పెట్టిన ఆపిల్

ఈ సందర్భంగా భారత్ సహా కొన్ని దేశాలు అమెరికా ఉత్పత్తులపై అధిక దిగుమతి సుంకాలు (టారిఫ్‌లు) విధిస్తున్నాయని ట్రంప్ వ్యాఖ్యానించారు. భారత్ కూడా అమెరికా ఉత్పత్తులపై ఎక్కువ టారిఫ్‌లు వసూలు చేస్తున్న దేశాల్లో ఒకటని స్పష్టం చేశారు. చైనాతో అమెరికా సంబంధాల్లో తలెత్తిన అభిప్రాయ భేదాల నేపథ్యంలో యాపిల్ ముందస్తుగా అప్రమత్తమైంది. చైనాపై అమెరికా భారీ టారిఫ్‌లు విధించడంతో, తాను అమెరికాకు సరఫరా చేసే ఐఫోన్లను భారత్‌లో తయారు చేయాలని యాపిల్ యోచించింది. ఇప్పటికే ఫాక్స్‌కాన్‌, టాటా ఎలక్ట్రానిక్స్ వంటి సంస్థలు భారత్‌లో ఐఫోన్లను అసెంబుల్‌ చేస్తున్నాయి.

వివరాలు 

చాలా వస్తువులపై భారత్‌ జీరో టారిఫ్‌లు ఆఫర్‌ 

ఆపిల్ సీఈవో టిమ్ కుక్ ఇటీవల చేసిన ప్రకటనలో,జూన్ త్రైమాసికంలో అమెరికా మార్కెట్లో విక్రయించనున్న ఐఫోన్లలో అత్యధికంగా భారత్‌లో తయారైనవే ఉంటాయని తెలిపారు. అయితే, ఐపాడ్స్‌,మ్యాక్‌బుక్స్‌, యాపిల్ వాచ్‌లు,ఎయిర్‌పాడ్స్‌ వంటి ఉత్పత్తుల కోసం కంపెనీ వియత్నాం మీదే ఆధారపడుతుందని పేర్కొన్నారు. ఇక భారత్ అమెరికాకు ఓ ముఖ్యమైన వాణిజ్య ఒప్పందాన్ని ప్రతిపాదించినట్టు ట్రంప్ వెల్లడించారు. ''ఇది ఒక ప్రాథమిక ఒప్పందం,ఇందులో భారత్‌ అమెరికా దిగుమతులపై జీరో టారిఫ్‌లను ఆఫర్ చేసింది'' అని ట్రంప్ పేర్కొన్నారు. ఇక ఇప్పటికే భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలపై చర్చలు కొనసాగుతున్నాయి. ఈ చర్చలు వేగంగా సాగుతున్నాయని,ఏప్రిల్ 30న ట్రంప్ స్వయంగా ప్రకటించారు. త్వరలో ఈ ఒప్పందాన్ని తుదిసమ్మతి దిశగా తీసుకెళ్లగలమన్న నమ్మకాన్ని కూడా ఆయన వ్యక్తం చేశారు.