Paytm: పేటీఎం వ్యవస్థాపకులు, డైరెక్టర్లకు సెబీ షోకాజ్ నోటీసులు
ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ పేటియం మాతృ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ షేర్లు నేడు మార్కెట్‌లో భారీగా క్షీణించాయి. కంపెనీ వ్యవస్థాపకుడు విజయ్‌శేఖర్ శర్మకు మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు వార్తలు వెలువడటంతో ఈ క్షీణత చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో సోమవారం పేటీఎం షేర్లు బీఎస్‌ఈలో ఒక దశలో 8.88 శాతం తగ్గిపోయి 505.25 రూపాయలకు చేరాయి. అనంతరం షేర్లు కొంతమేర కోలుకున్నాయి. 2021లో పేటీఎం ఐపీఓ విడుదలైంది. ప్రమోటర్ క్లాసిఫికేషన్ నిబంధనలు పాటించలేదని ఆర్‌బీఐ ఇచ్చిన ఇన్‌పుట్స్ ఆధారంగా సెబీ విజయ్‌శేఖర్ శర్మకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు 'మనీకంట్రోల్' వెల్లడించింది.
మాజీ బోర్డు మెంబర్లకు నోటీసులు
ఈ నోటీసులు సంస్థ మాజీ బోర్డు మెంబర్లకు కూడా జారీ చేసినట్లు తెలిసింది. 2021లో పేటీఎం షేర్లు రూ.2150 ఇష్యూ ధరతో విడుదలైనప్పటికీ, 9 శాతం డిస్కౌంట్‌తో రూ.1995 వద్ద లిస్టయ్యాయి. ఆ సమయంలోనే ఇన్వెస్టర్లకు నిరాశను కలిగించాయి. తర్వాత ఈ షేర్లు ఎప్పటికీ ఆ స్థాయిని తిరిగి చేరుకోలేకపోయాయి. ప్రస్తుతం పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై ఆర్‌బీఐ చర్యల నేపథ్యంలో ఈ ఏడాది షేరు ధర రూ.310 వద్ద కనిష్టాన్ని తాకింది. తాజా షాక్ ఈ షేర్లను మరింత ఒత్తిడికి గురిచేస్తుంది.