
Subodh Kumar Goel: యూకో బ్యాంక్ మాజీ సీఎండీ సుబోధ్ కుమార్ గోయల్‌ను అరెస్టు చేసిన ఈడీ
ఈ వార్తాకథనం ఏంటి
యూకో బ్యాంక్ మాజీ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ) సుబోధ్ కుమార్ గోయల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్ట్ చేసింది. కాన్‌కాస్ట్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్ (CSPL)కు రుణాల మంజూరులో జరిగిన అక్రమాల నేపథ్యంలో ఆయనను మనీలాండరింగ్ ఆరోపణలపై అదుపులోకి తీసుకున్నారు. సుబోధ్ కుమార్ గోయల్ యూకో బ్యాంక్‌లో సీఎండీగా పనిచేస్తున్న సమయంలో, సీఎస్‌పీఎల్‌కు భారీగా రూ.6,210.72 కోట్ల మేర రుణాలను మంజూరు చేశారు. అయితే, ఈ నిధులను ఆ కంపెనీ దుర్వినియోగం చేసిందని సీబీఐ చేసిన విచారణలో వెల్లడైంది. అంతేకాదు, ఈ రుణాల మంజూరుకు ప్రతిఫలంగా గోయల్‌కు లంచం చెల్లించబడిందని కూడా సీబీఐ తన ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది.
వివరాలు
మే 21 వరకు ఈడీ కస్టడీలో
ఇంకా, ఆ నిధులలో ఒక భాగం గోయల్‌కు, ఆయన కుటుంబ సభ్యులకు సంబంధించిన షెల్ కంపెనీల ఖాతాల్లోకి మళ్లినట్లు కూడా సీబీఐ గుర్తించింది. దీనితో మనీలాండరింగ్ ఆరోపణలపై ఈడీ తన దర్యాప్తును ప్రారంభించి, చివరకు ఆయనను అరెస్ట్ చేసింది. మే 17న సుబోధ్ గోయల్‌ను ప్రివెషన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్‌ఏ)కు సంబంధించిన ప్రత్యేక కోర్టు ముందు హాజరుపరిచారు. విచారణ అనంతరం, కోర్టు ఆయనను మే 21 వరకు ఈడీ కస్టడీలో ఉంచేందుకు అనుమతి ఇచ్చింది.