వివో కేసులో ఈడీ పంజా.. మనీలాండరింగ్ కేసులో లావా ఎండీ సహా నలుగురి అరెస్ట్
చైనా మొబైల్ తయారీ కంపెనీ వివో మెడకు మనీలాండరింగ్ కేసు చుట్టుకుంది. ఈ మేరకు సంస్థలో కీలక పరిణామం జరిగింది. ఈ కేసులో లావా ఇంటర్నేషనల్ మొబైల్ కంపెనీ ఎండీ హరి ఓం రాయ్ తో పాటు మరో నలుగురిని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్టులు చేసింది. ఇందులో ఒకరు చైనాకి సంబంధించిన వ్యక్తి కాగా మరొకరు చార్టర్డ్ అకౌంటెంట్, ఇంకో వ్యక్తి ఉన్నారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం (Prevention of Money Laundering Act, 2002) కింద ఈ నలుగురినీ అదుపులోకి తీసుకున్నామని ఈడీ వెల్లడించింది. అనంతరం నిందితులను కోర్టులో హాజరుపర్చనున్నామని పేర్కొంది.ఈ మేరకు వారిని కస్టడీకి కోరే అవకాశం ఉంది. వివో కేసులో లావా ఎండీని ఎందుకు అరెస్ట్ చేశారన్నది కొసమెరుపు.
15 నెలల తర్వాత మళ్లీ అరెస్టులు
వివో సంస్థపై దిల్లీ పోలీసులు గతంలోనే ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. అయితే దాని ఆధారంగానే తాజాగా మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఈడీ (Enforcement Directorate) దర్యాప్తు కొనసాగిస్తోంది. ఈ క్రమంలోనే గతేడాది జులైలో దేశవ్యాప్తంగా వివో సహా దాని అనుబంధ సంస్థల్లో ఈడీ సోదాలు విస్తృతం చేసింది. అయితే వివో సంస్థ వ్యాపారంలో సగానికిపైగా నిధులు (రూ.62,476 కోట్ల)ను చైనాకు తరలించినట్లు ఈడీ నిర్థారించింది. ఫలితంగానే పెద్ద ఎత్తున భారత్‌లో పన్ను ఎగవేతకు పాల్పడినట్లు ఈడీ గతంలోనే వివరించింది.ఈ నేపథ్యంలోనే వివో కంపెనీకి చెందిన బ్యాంకు ఖాతాలనూ ఈడీ స్తంభింపజేసింది. ఈ మేరకు సుమారు 15 నెలల తర్వాత మళ్లీ ఈ కేసులో అరెస్టులు సంభవించాయి.