Elon Musk: 344 బిలియన్ డాలర్లతో ఎలాన్ మస్క్ సరికొత్త రికార్డు.. కుబేరుల జాబితాలో అగ్రస్థానం!
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌కు మద్దతు ఇచ్చిన మస్క్, ఇప్పుడు తన ఆర్థిక స్థాయిలోనూ భారీ ఎత్తున పెరుగుదల సాధించారు. తాజా సమాచారం ప్రకారం, మస్క్ నికర సంపద 334.3 బిలియన్ డాలర్లకు చేరింది. ఈ మేరకు అమెరికాకు చెందిన ప్రముఖ మీడియా సంస్థ పేర్కొంది. అమెరికా ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు నుంచి టెస్లా స్టాక్‌లో 40 శాతం పెరుగుదల చోటు చేసుకుంది. ప్రత్యేకంగా గత శుక్రవారం ఒక్కరోజే టెస్లా స్టాక్ 3.8 శాతం లాభపడటంతో మస్క్ సంపద భారీగా పెరిగింది. ఈ వృద్ధితో మస్క్ ప్రపంచంలో అత్యంత ధనవంతుడిగా నిలిచారు.
ట్రంప్ కు కీలక బాధ్యతలు
ప్రచార కార్యక్రమాలలో భాగస్వామ్యం కల్పించడమే కాకుండా భారీ విరాళాలు కూడా అందించారు. ఈ విజయానికి ప్రతిఫలంగా, ట్రంప్ తన ప్రభుత్వంలో మస్క్‌కు కీలక బాధ్యతలు అప్పగించారు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ (డోజ్)లో మస్క్‌ను వివేక్ రామస్వామితో కలిసి సంయుక్త సారథిగా నియమించారు. ట్రంప్ విజయం, టెస్లా స్టాక్ పెరుగుదల, అలాగే నూతన ప్రభుత్వంలో కీలక బాధ్యతలు చేపట్టడంతో మస్క్ సంపద పెరుగుదలకు ప్రధాన కారణమని తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఎలాన్ మస్క్ తన వ్యాపార సామ్రాజ్యాన్ని మరింత విస్తరించే అవకాశాలున్నాయి. డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ బాధ్యతల్లో మస్క్ సరికొత్త ఆవిష్కరణలు చేస్తూ, ప్రభుత్వ రంగంలో తన ప్రభావాన్ని పెంచవచ్చనే అభిప్రాయం నిపుణుల్లో వ్యక్తమవుతోంది.