LOADING...
Elon Musk: ర్యాన్ఎయిర్ కొనుగోలుపై ఎలాన్ మస్క్ పోల్… సోషల్ మీడియాలో రచ్చ
ర్యాన్ఎయిర్ కొనుగోలుపై ఎలాన్ మస్క్ పోల్… సోషల్ మీడియాలో రచ్చ

Elon Musk: ర్యాన్ఎయిర్ కొనుగోలుపై ఎలాన్ మస్క్ పోల్… సోషల్ మీడియాలో రచ్చ

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 20, 2026
05:34 pm

ఈ వార్తాకథనం ఏంటి

టెస్లా, స్పేస్‌-X సంస్థల అధినేతగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన కుబేరుడు ఎలాన్ మస్క్ మరోసారి తన సోషల్ మీడియా కార్యకలాపాలతో చర్చకు తెరలేపారు. యూరప్‌లో అతిపెద్ద లో-కాస్ట్ విమానయాన సంస్థగా పేరున్న 'ర్యాన్ఎయిర్'ను కొనుగోలు చేయాలా? అనే ప్రశ్నతో ఆయన తన ఎక్స్ ఖాతాలో ఓ పోల్ ప్రారంభించారు. ర్యాన్ఎయిర్ సీఈఓ మైఖేల్ ఓ'లియరీతో ఇటీవల చోటుచేసుకున్న ఘాటు వాగ్వాదం అనంతరం ఈ పోల్ రావడం విశేషంగా మారింది. ర్యాన్ఎయిర్ విమానాల్లో ఇన్‌ఫ్లైట్ వైఫై సేవల కోసం స్టార్‌లింక్ టెక్నాలజీని వినియోగించాలనే అంశంతో మొదలైన వ్యాపార చర్చలు క్రమంగా వ్యక్తిగత విమర్శల దాకా వెళ్లాయి. స్టార్‌లింక్ సేవల ఖర్చు తమ బడ్జెట్ మోడల్‌కు సరిపోదని చెబుతూ ఆ ప్రతిపాదనను ర్యాన్ఎయిర్ తిరస్కరించింది.

వివరాలు 

మస్క్ మాటలకు విలువ లేదు 

ఇదే సందర్భంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన సీఈఓ ఓ'లియరీ, ఎలాన్ మస్క్‌ను తీవ్రంగా విమర్శిస్తూ అతడిని "ఇడియట్"గా అభివర్ణించారు. అంతేకాదు, మస్క్ మాటలకు విలువ లేదని కూడా వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలకు మస్క్ వెంటనే ప్రతిస్పందించారు. ఓ'లియరీని "అట్టర్ ఇడియట్"గా పిలుస్తూ, అతడిని పదవి నుంచి తొలగించాలని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ మాటల యుద్ధం నడుస్తున్న తరుణంలోనే ర్యాన్ఎయిర్‌ను కొనుగోలు చేయాలా వద్దా అనే అంశంపై మస్క్ పోల్ నిర్వహించడం మరింత ఆసక్తిని రేపింది.

వివరాలు 

సోషల్ మీడియాలో హాట్ టాపిక్

కొద్ది గంటల్లోనే ఈ పోల్‌కు సుమారు 7 లక్షల 50 వేలకుపైగా ఓట్లు నమోదయ్యాయి. వీటిలో 76.8 శాతం మంది ర్యాన్ఎయిర్ కొనుగోలుకు అనుకూలంగా స్పందించారు. దీనిపై తనదైన శైలిలో స్పందించిన మస్క్, "ర్యాన్ఎయిర్‌ను 'ర్యాన్' అనే వ్యక్తే నడపాలి. అతడిని నిజమైన అధికారి చేయడం మీ బాధ్యత" అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. అయితే, ఈ పోల్ నిజంగా టేకోవర్ దిశగా వేసిన అడుగేనా? లేక కేవలం హాస్యంగా చేసిన ప్రయత్నమా? అనే విషయంపై మస్క్ స్పష్టమైన ప్రకటన చేయలేదు. ఈ మొత్తం వ్యవహారం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారి విస్తృత చర్చకు దారితీస్తోంది.

Advertisement