Elon Musk : ఎలాన్ మస్క్ సంచలన రికార్డు.. మొదటిసారి 350 బిలియన్ డాలర్లు దాటిన సంపద
ప్రపంచంలోని అత్యంత సంపన్న వ్యాపారవేత్తగా ఎలాన్ మస్క్ ఇప్పుడు చరిత్ర సృష్టించారు. ఆయన మొత్తం సంపద 350 బిలియన్ డాలర్లను దాటింది. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం, ఎలోన్ మస్క్ నికర విలువలో 10 బిలియన్ డాలర్ల పెరుగుదల నమోదైంది. ఈ ఏడాది మొదటి నుండి 124 బిలియన్ డాలర్లు పెరిగిన ఆయన సంపద, గత నెలలో 89 బిలియన్ డాలర్లు పెరగడం విశేషం. ఇదే జోరు కొనసాగితే ఈ ఏడాది చివరి నాటికి ఎలాన్ మస్క్ 400 బిలియన్ డాలర్లు అధిగమించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
రాబడిని సాధించిన టెస్లా పెట్టుబడిదారులు
2021 నవంబరులో 300 బిలియన్ డాలర్ల మార్క్‌ను దాటిన ఎలాన్ మస్క్, ఇప్పుడు 2024 నవంబరులో 353 బిలియన్ డాలర్లను చేరుకున్నాడు. ఆయన 400 బిలియన్ డాలర్ల విలువను 2024 చివరికి సాధించవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. టెస్లా షేర్లలో 47 శాతం పెరుగుదల, 3.46 శాతం పైగా ద్రవ్య విలువ పెరిగినట్లు తెలిసింది. 2024లో ఇప్పటి వరకు టెస్లా పెట్టుబడిదారులకు 43.74 శాతం రాబడిని అందించింది.