పీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త..పెన్షన్ వివరాల సమర్పణకు 3 నెలలు గడువు పొడిగింపు
ప్రొవిడెంట్ ఫండ్ ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. ఈ మేరకు పెన్షన్ వివరాలను సమర్పించేందుకు గడువును మరో మూడు నెలల పాటు పొడిగిస్తూే నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే డిసెంబర్ 31ని ఆఖరి తేదీగా ప్రకటించింది. అధిక వేతనాలపై పెన్షన్‌కు సంబంధించి ఉద్యోగుల జీతాల వివరాల అప్‌లోడ్ చేసేందుకు కంపెనీలకు (ఉపాధి కల్పనదారులు) ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) మరో మూడు నెలల వెసులుబాటును కల్పించింది. దీంతో డిసెంబర్ 31ని తుది గడువుగా పేర్కొంది. వాస్తవానికి ఈ నెలాఖరుతోనే అంటే సెప్టెంబర్ 30తో గడువు ముగిసిపోనుంది.
2023 ఆఖరు వరకు గడువు పొడిగింపుపై కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ ఆమోదం
ఈ నేపథ్యంలోనే కంపెనీలు, ఆయా సంస్థల ఉద్యోగ సంఘాలు విజ్ఞప్తులు అందించడంతో గడువు పొడిగింపు నిర్ణయం తీసుకున్నారు. 2023 ఆఖరు దాకా సమయం ఇస్తున్నామని కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ ప్రకటనలో వెల్లడించింది. అయితే శుక్రవారం నాటికి 5.52 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని కార్మిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. వ్యాలిడేషన్ ఆప్షన్/జాయింట్ ఆప్షన్‌ల నిమిత్తం ఇవి ఇంకా పూర్తి కాలేదని చెప్పుకొచ్చింది. ఫలితంగానే ఆయా సంస్థలు, ఆయా కంపెనీల్లోని ఉద్యోగ సంఘాల అభ్యర్థనల్ని పరిగణనలోకి తీసుకుని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీ ఛైర్మన్ గడువును పొడిగించారని చెప్పడం గమనార్హం.