Stock market: నాలుగో రోజు భారీ లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు
ఈ వార్తాకథనం ఏంటి
బెంచ్‌మార్క్ సూచీలైన సెన్సెక్స్, నిఫ్టీ వరుసగా నాలుగోరోజూ లాభాల్లో ముగిశాయి.
ముఖ్యంగా బ్యాంకింగ్, ఐటీ రంగాల షేర్లలో కొనుగోళ్ల మద్దతు సూచీలకు కలిసొచ్చింది.
అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను స్థిరంగా ఉంచినప్పటికీ, ఈ ఏడాది రెండుసార్లు కీలక రేట్ల కోత ఉంటుందని సంకేతాలివ్వడం మన మార్కెట్లకు బూస్ట్ ఇచ్చినట్టైంది.
దీంతో సెన్సెక్స్ ఓ దశలో వెయ్యి పాయింట్ల మేర లాభపడగా, నిఫ్టీ కూడా 23,200 స్థాయిని దాటింది. అయితే, మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు స్వల్ప స్థాయిలోనే కదలాడాయి.
మదుపర్ల సంపదగా భావించే బీఎస్‌ఈలో నమోదిత కంపెనీల మొత్తం విలువ రూ.3 లక్షల కోట్ల మేర పెరిగి, రూ.408 లక్షల కోట్లకు చేరింది.
వివరాలు
సెన్సెక్స్, నిఫ్టీ ముగింపు స్థాయులు
సెన్సెక్స్ ఉదయం 75,917.11 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది (క్రితం ముగింపు 75,449.05). రోజంతా లాభాల్లోనే కదలాడి, ఇంట్రాడేలో 76,456.25 పాయింట్ల గరిష్టాన్ని తాకి, చివరికి 899.01 పాయింట్ల లాభంతో 76,348.06 వద్ద ముగిసింది.
నిఫ్టీ సైతం 283.05 పాయింట్ల లాభంతో 22,190.65 పాయింట్ల వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 86.33గా ఉంది.
వివరాలు
ప్రధాన లాభాలు, నష్టాలు
సెన్సెక్స్ 30 సూచీలో ఇండస్‌ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, అల్ట్రాటెక్ సిమెంట్ మినహా మిగిలిన అన్ని షేర్లు లాభాల్లో ముగిశాయి.
భారతీ ఎయిర్‌టెల్, టైటాన్, మహీంద్రా & మహీంద్రా, హిందుస్థాన్ యూనిలీవర్, టీసీఎస్ షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి.
బంగారం ఔన్సు ధర 3,049 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
వివరాలు
కారణాలు ఇవే..
1. ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల నిర్ణయం
అందరూ ఊహించినట్లే ఫెడ్ ఈ సారి వడ్డీ రేట్లను స్థిరంగా ఉంచింది.అయితే,ఈ ఏడాది రెండు సార్లు కోత ఉంటుందని సంకేతాలివ్వడం మార్కెట్లకు పాజిటివ్ వాతావరణాన్ని తీసుకువచ్చింది. అమెరికాలో వడ్డీ రేట్లు తగ్గితే,డాలర్ బలహీనపడటంతో భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల మార్కెట్ల వైపు విదేశీ మదుపర్లు దృష్టి సారించే అవకాశం ఉంటుంది.
2. ఐటీ స్టాక్స్ కొనుగోళ్లు
ఈ ఏడాది 16% మేర పతనమైన నిఫ్టీ ఐటీ ఇండెక్స్,ఈ రోజు 2% మేర పుంజుకోవడం, మార్కెట్‌కు తోడ్పడింది.
3. అంతర్జాతీయ మార్కెట్ల నుండి బలమైన సంకేతాలు
నిన్నటి అమెరికా మార్కెట్ల సానుకూల ప్రభావం ఇతర ప్రపంచ మార్కెట్లను లాభాల్లో నడిపించింది.
వివరాలు
కారణాలు ఇవే..
ట్రంప్ వాణిజ్య భయాలు ఉన్నా, వడ్డీ రేట్ల కోత సంకేతాలు ప్రపంచ మార్కెట్లకు ఊరటను అందించాయి.
4. బాండ్ రాబడులు, డాలర్ ఇండెక్స్ ప్రభావం
అమెరికాలో బాండ్ రాబడులు, డాలర్ ఇండెక్స్ బలహీనపడటంతో, భారత మార్కెట్లలో నిధుల ప్రవాహానికి అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి.
10 ఏళ్ల బాండ్ రాబడులు 4.24% వద్దకు తగ్గగా, డాలర్ ఇండెక్స్ 103.36 స్థాయికి పడిపోవడం, విదేశీ పెట్టుబడిదారులను ఆకర్షించాయి.
మొత్తం మీద, బ్యాంకింగ్ & ఐటీ రంగాల్లో కొనుగోళ్లు, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై సంకేతాలు, అంతర్జాతీయ మార్కెట్ల పాజిటివ్ ట్రెండ్ - ఇవన్నీ కలిసి భారత స్టాక్ మార్కెట్లను బలపరిచాయి.