EPFO: ఉద్యోగుల యూఏఎన్ సక్రియంగా ఉండేలా చూడండి.. కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వశాఖ నిర్దేశం
కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వశాఖ, ఉద్యోగులు ఎంప్లాయిమెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ (ఈఎల్‌ఐ) పథకం ద్వారా పూర్తి ప్రయోజనాలను పొందేందుకు వారి యూఏఎన్ (యూనివర్సల్ అకౌంట్ నంబర్) సక్రియంగా ఉండాలని ఈపీఎఫ్ఓను ఆదేశించింది. దీనికి సంబంధించి, జోనల్,ప్రాంతీయ కార్యాలయాల సేవలను ఉపయోగించుకోవాలని సూచించింది. ఈఎల్‌ఐ పథకం ద్వారా గరిష్ఠమైన సంఖ్యలో యజమానులు, ఉద్యోగులు పథక ప్రయోజనాలు పొందడానికి, ఉద్యోగుల మధ్య విస్తృత ప్రచారంతో యూఏఎన్ క్రియాశీలతను పెంచేందుకు మంత్రిత్వశాఖ విజ్ఞప్తి చేసింది. ఇది సమగ్రంగా ఈపీఎఫ్ఓ ఆన్‌లైన్ సర్వీసులను ఉపయోగించుకోవడానికి, పీఎఫ్ ఖాతాలను సమర్థవంతంగా నిర్వహించడానికి అవకాశం కల్పిస్తుంది.
ఉద్యోగులు, ఇంటి నుంచే ఈ సేవలను పొందవచ్చు
అలాగే, పీఎఫ్ పాస్‌బుక్‌లు డౌన్‌లోడ్ చేయడం, విత్‌డ్రాలు, అడ్వాన్సులకు ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణ, బదిలీలు, వ్యక్తిగత సమాచార అప్‌డేషన్లు వంటి సేవలు సకాలంలో అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఉద్యోగులు ఎప్పటికప్పుడు, ఇంటి నుంచే ఈ సేవలను పొందవచ్చు, తద్వారా పీఎఫ్ కార్యాలయాలను సందర్శించే అవసరం లేకుండా 24/7 సేవలను పొందే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.