EPFO: డిసెంబర్ చివరి నాటికి UPI ద్వారా PF విత్‌డ్రా.. EPFO కీలక నిర్ణయం!
ఈ వార్తాకథనం ఏంటి
ఉద్యోగుల భవిష్య నిధి (EPF) చందాదారులకు త్వరలోనే మరో సదుపాయం అందుబాటులోకి రానుంది. ఇకపై యూపీఐ (UPI) ద్వారా కూడా పీఎఫ్ డబ్బులను విత్‌డ్రా చేసుకునే అవకాశం కల్పించేందుకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) సిద్ధమవుతోంది. ఈ సదుపాయాన్ని డిసెంబర్ చివరి నాటికి ప్రారంభించే అవకాశం ఉందని ది ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్ తన కథనంలో వెల్లడించింది. ఈ కొత్త విధానం అందుబాటులోకి వస్తే.. చందాదారులు BHIM యాప్ ద్వారా తమ పీఎఫ్ ఖాతాలోని అర్హత ఉన్న మొత్తాన్ని నేరుగా విత్‌డ్రా చేసుకోవచ్చు. అంతేకాకుండా ఎంత మొత్తం తీసుకోవచ్చో, పదవీ విరమణ ఖాతాలో కనీసం ఎంత బ్యాలెన్స్ ఉంచాలో కూడా తెలుసుకోవచ్చు.
వివరాలు
2027 ఫిబ్రవరి నాటికీ అమలు చేసే అవకాశం
యూపీఐ ద్వారా పీఎఫ్ విత్‌డ్రా సదుపాయం ప్రస్తుతం తుది దశలో ఉందని సమాచారం.
దీనికి సంబంధించి అన్ని పరీక్షలు పూర్తయ్యాయని, ట్రయల్స్ సమయంలో ఎదురైన సాంకేతిక సమస్యలను కూడా పరిష్కరించినట్లు ఆ కథనం పేర్కొంది.
ఈ కొత్త సదుపాయం EPFO చేపట్టిన సాంకేతిక మార్పుల్లో భాగంగా రానుంది.
EPFO 3.0 పేరుతో చేపట్టిన ఈ అప్‌గ్రేడ్‌ను 2027 ఫిబ్రవరిలో జరిగే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ తదుపరి సమావేశం నాటికి అమలు చేసే అవకాశం ఉందని సమాచారం.
వివరాలు
UPI ద్వారా PF డబ్బులు ఎలా తీసుకోవచ్చు?
యూపీఐ ద్వారా పీఎఫ్ డబ్బులు విత్‌డ్రా చేసుకునే సదుపాయాన్ని సభ్యుడి యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN), యూపీఐ ఖాతాతో అనుసంధానించనున్నారు.
అయితే EPFO ఖాతాతో లింక్ అయి, ధ్రువీకరణ పూర్తయిన బ్యాంకు ఖాతాలకు మాత్రమే ఈ సదుపాయం అందుబాటులో ఉండే అవకాశం ఉంది.
అంటే బ్యాంకు ఖాతా, యూఏఎన్ వివరాలు సరిగ్గా అనుసంధానమై ఉండాలి. అప్పుడే యూపీఐ ద్వారా పీఎఫ్ డబ్బులు తీసుకోవచ్చు.
వివరాలు
UPI ద్వారా ఎంత PF డబ్బు విత్‌డ్రా చేసుకోవచ్చు?
ప్రస్తుత సమాచారం ప్రకారం.. పీఎఫ్ ఖాతాలో ఉన్న మొత్తంలో 75 శాతం వరకు విత్‌డ్రా చేసుకునే అవకాశం కల్పించవచ్చని తెలుస్తోంది.
అయితే దీనిపై EPFO ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి పరిమితిని ప్రకటించలేదు.
మరోవైపు, నవంబర్ 19న జరిగిన బోర్డు సమావేశంలో పీఎఫ్ ఖాతాలో తప్పనిసరిగా ఉంచాల్సిన కనీస నిల్వను 25 శాతం నుంచి 10 శాతానికి తగ్గించే ప్రతిపాదనకు ఆమోదం తెలిపినట్లు సమాచారం.
ఈ నిర్ణయం అమల్లోకి వస్తే.. అర్హత ఉన్న నిల్వలో 75 శాతం నుంచి 90 శాతం వరకు పాక్షికంగా విత్‌డ్రా చేసుకునే అవకాశం పెరగవచ్చు.
అయితే దీనిపై తుది మార్గదర్శకాలు రావాల్సి ఉంది.
వివరాలు
పాక్షికంగా PF విత్‌డ్రా చేసుకోవడం మరింత సులభం
ఉద్యోగులు తమ ఉద్యోగ కాలంలో వివిధ అవసరాల కోసం పీఎఫ్ ఖాతా నుంచి కొంత మొత్తాన్ని తీసుకునే సదుపాయం ఇప్పటికే ఉంది.
అయితే ఈ విధానాన్ని మరింత సులభతరం చేసేందుకు EPFO పలు మార్పులు చేపట్టింది.
గతంలో పాక్షిక విత్‌డ్రాలకు సంబంధించి ఉన్న 13 నిబంధనలను మూడు విభాగాలుగా కుదించింది.
అవి అత్యవసర అవసరాలు (Essential Needs), ఇంటి అవసరాలు (Housing Needs), ప్రత్యేక పరిస్థితులు (Special Circumstances). ప్రస్తుతం పిల్లల చదువుల కోసం పీఎఫ్ నుంచి గరిష్ఠంగా 10 సార్లు, వివాహ అవసరాల కోసం ఐదు సార్లు డబ్బులు తీసుకునేందుకు అనుమతి ఉంది.
గతంలో ఈ రెండు అవసరాలకు మూడుసార్లు మాత్రమే విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉండేది.
వివరాలు
EPFO 3.0 అంటే ఏమిటి?
అంతేకాకుండా పాక్షిక విత్‌డ్రా కోసం కనీస ఉద్యోగ సేవా కాలాన్ని 12 నెలలుగా నిర్ణయించింది.
అర్హత ఉన్న అడ్వాన్స్ క్లెయిమ్‌లను ఆటోమేటిక్‌గా పరిష్కరించే పరిమితిని కూడా రూ.5 లక్షలకు పెంచింది.
EPFO 3.0 అనేది ఉద్యోగుల భవిష్య నిధి సంస్థలో చేపడుతున్న భారీ సాంకేతిక మార్పుల కార్యక్రమం.
ఆధునిక బ్యాంకింగ్ వ్యవస్థ తరహాలో సేవలను అందుబాటులోకి తీసుకురావడం దీని ప్రధాన ఉద్దేశం.
వివరాలు
EPFO 3.0 అంటే ఏమిటి?
పేపర్‌వర్క్ తగ్గించడం, క్లెయిమ్‌ల పరిష్కారాన్ని వేగవంతం చేయడం, సభ్యులందరికీ ఒకే వేదికపై సేవలు అందించడం వంటి లక్ష్యాలతో దీన్ని రూపొందిస్తున్నారు.
ఇందులో భాగంగా తక్షణ నగదు ఉపసంహరణలు, వివిధ భారతీయ భాషల్లో స్వీయ సేవలు, ఉద్యోగుల జీతాలకు అనుసంధానమైన పీఎఫ్ చందాల చెల్లింపులు వంటి సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి.
ఈ మార్పులు అమల్లోకి వస్తే పీఎఫ్ ఖాతాదారులకు సేవలు మరింత వేగంగా, సులభంగా అందే అవకాశం ఉంది.