PF New Rule:ఈపీఎఫ్‌వో కొత్త రూల్ ఏంటి? అది ఎలా పనిచేస్తుంది?
ఈ వార్తాకథనం ఏంటి
ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) పాలసీలో కొత్త మార్పును తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది.
ఈ కొత్త మార్గదర్శక ప్రకారం, మీకు పీఎఫ్ అకౌంట్ ఉంటే, మీ పీఎఫ్ కంట్రిబ్యూషన్‌పై స్థిరమైన వడ్డీ రేటు లభించేలా చేయనుంది.
దీనికోసం ప్రభుత్వం వడ్డీ స్థిరీకరణ రిజర్వ్ ఫండ్ అనే ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసే యోచనలో ఉంది.
జాతీయ మీడియా తెలిపిన వివరాల ప్రకారం, ఈ మార్పుతో 6.5 కోట్ల మంది ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు ప్రయోజనం చేకూరనుంది.
వివరాలు
వడ్డీ స్థిరీకరణ రిజర్వ్ ఫండ్ - దీని ప్రాముఖ్యత ఏమిటి?
ఈపీఎఫ్‌వో వడ్డీ స్థిరీకరణ రిజర్వ్ ఫండ్ అనే ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలని పరిశీలిస్తోంది.
దీని ప్రధాన ఉద్దేశం ఏమిటంటే, ఈపీఎఫ్‌వో పెట్టుబడులపై వచ్చే ఆదాయం ఎంతైనా వడ్డీ రేటును స్థిరంగా ఉంచడం.
ప్రస్తుతం, ఈపీఎఫ్‌వో వడ్డీ రేటు మార్కెట్‌లో పెట్టుబడుల ద్వారా వచ్చిన ఆదాయంపై ఆధారపడి ఉంటుంది.
ఆదాయం ఎక్కువగా ఉంటే వడ్డీ రేటు కూడా పెరుగుతుంది. కానీ ఆదాయం తగ్గినప్పుడు వడ్డీ రేటు కూడా తగ్గుతుంది.
వివరాలు
ఈ కొత్త ఫండ్ వల్ల కలిగే ప్రయోజనాలు
ఈపీఎఫ్‌వో రాబడి ఎక్కువగా ఉన్నప్పుడు కొంత నిధిని ఈ ప్రత్యేక ఫండ్‌లో నిల్వ చేసి, రాబడి తక్కువగా ఉన్న సమయంలో ఖాతాదారులకు స్థిరమైన వడ్డీ రేటును అందించనుంది.
మార్కెట్ ఒడిదుడుకుల ప్రభావాన్ని తగ్గించేందుకు ఈపీఎఫ్‌వో స్థిరమైన వడ్డీ రేటును అందించేందుకు ముందుకు వస్తోంది.
రాబడులు తగ్గినప్పటికీ, ఖాతాదారులకు నష్టమయ్యే పరిస్థితి ఉండదు.
వివరాలు
ఈ కొత్త రూల్ ఎప్పుడు అమలులోకి వస్తుంది?
ప్రస్తుతం ఈ కొత్త మార్పు ప్రాథమిక చర్చల దశలో ఉంది. ఈ ఏడాది చివరిలో దీనిపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కొత్త నిబంధనలను 2026-2027 నాటికి అమలు చేయనున్నట్లు అంచనా.
ఈపీఎఫ్‌వో వడ్డీ రేట్ల పై తాజా సమాచారం
గత కొన్ని ఏళ్లుగా ఈపీఎఫ్‌వో వడ్డీ రేట్లు హెచ్చుతగ్గులకు గురవుతున్నాయి.
2023-24 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్‌వో 8.25% వడ్డీ రేటును ఖరారు చేసింది.
ఇకపై 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఫిబ్రవరి 28న జరిగే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సమావేశంలో కొత్త వడ్డీ రేటు నిర్ణయించే అవకాశం ఉంది.