
FASTag: నిబంధనలకు విరుద్ధంగా వాడితే ఫాస్టాగ్ రద్దు.. NHAI కీలక నిర్ణయం!
ఈ వార్తాకథనం ఏంటి
టోల్‌ప్లాజాల వద్ద ప్రయాణాన్ని మరింత సులభతరం చేయాలన్న దిశగా కేంద్ర ప్రభుత్వం పలు నూతన చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా, తాజాగా 'లూజ్ ఫాస్టాగ్'లపై కఠిన నిర్ణయం తీసుకుంది. వాహనదారులు ఫాస్టాగ్‌ను విండ్షీల్డ్‌పై సరిగ్గా అతికించకుండా ఉంచడం వల్ల ఏర్పడుతున్న అసౌకర్యాలను అధిగమించేందుకు, ఇటువంటి యూజర్లను బ్లాక్‌లిస్ట్ చేయనున్నట్టు జాతీయ రహదారుల సంస్థ (NHAI) ప్రకటించింది.
Details
లూజ్ ఫాస్టాగ్ అంటే ఏమిటి?
ఫాస్టాగ్ విధానం ప్రకారం, వాహనదారులు తమ బండి విండ్షీల్డ్‌పై ట్యాగ్‌ను అతికించి ఉండాలి. దీని వల్ల టోల్‌గేట్ల వద్ద ఉన్న స్కానింగ్ పరికరాలు ఫాస్టాగ్‌ను స్కాన్ చేయడం సులభం. కానీ కొంతమంది ఉద్దేశపూర్వకంగా ఫాస్టాగ్‌ను విండ్షీల్డ్‌పై అతికించకుండా, టోల్‌గేట్ల వద్ద పర్సు నుంచి తీసి చూపించడం వంటి చర్యలకు పాల్పడుతున్నారు. వీటినే 'లూజ్ ఫాస్టాగ్' గా పరిగణిస్తున్నారు. వాడకాన్ని దుర్వినియోగం చేస్తూ.. ఈ విధంగా వ్యవహరించే వాహనదారుల వల్ల టోల్ వసూలు ప్రక్రియలో ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ప్లాజాల వద్ద రద్దీ పెరుగుతోందని, టోలింగ్ వ్యవస్థను కొందరు దుర్వినియోగం చేస్తున్నారని ఎన్‌హెచ్‌ఏఐ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో టోల్ నిర్వహణ సాఫీగా సాగేందుకు లూజ్ ఫాస్టాగ్ యూజర్లపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది.
Details
రిపోర్ట్ చేస్తే బ్లాక్‌లిస్ట్
ఈ నిబంధనల అమలుకు టోల్ కలెక్టింగ్ ఏజెన్సీలను అప్రమత్తం చేసింది. లూజ్ ఫాస్టాగ్ వాహనదారులను గుర్తించిన వెంటనే ప్రత్యేకంగా అందుబాటులో ఉంచిన ఈమెయిల్ ఐడీకి రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. తర్వాత పరిశీలన చేసి, ఆ వాహనదారుల ఫాస్టాగ్‌ను బ్లాక్‌లిస్ట్‌లో చేర్చనున్నట్లు స్పష్టం చేసింది.
Details
కొత్త వార్షిక టోల్‌పాస్‌పై స్పష్టత
ఇటీవలే కేంద్రం ప్రకటించిన నూతన వార్షిక టోల్‌పాస్ విధానం ప్రకారం, రూ.3వేల చెల్లింపుతో వ్యక్తిగత కార్లు, జీపులు, వ్యాన్లు కలిగిన యజమానులు ఏడాది కాలం పాటు లేదా 200 ట్రిప్పుల వరకు జాతీయ రహదారులపై ప్రయాణించవచ్చు. ఈ సదుపాయం ఆగస్టు 15 నుంచి అందుబాటులోకి రానుంది. కాగా, ఈ కొత్త విధానం వ్యక్తిగత వాహనాలకే పరిమితమవుతుందని పేర్కొంది. ఈ విధంగా టోల్ గేట్ల వద్ద సమయాన్ని ఆదా చేస్తూ, వ్యవస్థను మరింత సమర్థవంతంగా అమలు చేయడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకుంది.