
US Federal Reserve: ద్రవ్యోల్బణం ఆందోళనల మధ్య ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్ల తగ్గింపు
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా ఫెడరల్ రిజర్వ్ (US Federal Reserve)ఒక కీలక ఆర్థిక నిర్ణయం తీసుకుంది. వడ్డీ రేట్లను తగ్గిస్తూ 25 బేసిస్ పాయింట్ల మేర కోత విధించింది.దీంతో ప్రస్తుతం యునైటెడ్ స్టేట్స్‌లో వడ్డీ రేట్లు 4 నుంచి 4.25 శాతం మధ్యకు చేరాయి. ఈ ఏడాదిలో ఇది మొదటి వడ్డీ కోత కాగా,చివరిసారి గత సంవత్సరం డిసెంబర్‌లోనే ఫెడ్ వడ్డీరేట్లను తగ్గించింది. ద్రవ్యోల్బణం పెరుగుతున్నప్పటికీ, మందగిస్తున్న లేబర్ మార్కెట్ కు మద్దతు ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఫెడ్ ఈ సారి 0.25 శాతం వడ్డీ తగ్గింపును అమలు చేసింది. అంతేకాకుండా, ఈ ఏడాది మరో రెండు సార్లు కూడా పావు శాతం చొప్పున వడ్డీ రేట్లు తగ్గించే అవకాశం ఉందని అధికారులు సంకేతాలు ఇచ్చారు.
వివరాలు
నిరుద్యోగం మరింత పెరిగే ప్రమాదం: జెరోమ్ పావెల్
వడ్డీరేట్ల తగ్గింపు వల్ల తనఖా రుణాలు, ఇల్లు కొనుగోలు రుణాలు, కార్ లోన్లు వంటి వాటి వడ్డీ భారం తగ్గనుంది. దీనివల్ల ప్రజలకు తక్కువ వడ్డీతో రుణాలు లభించే అవకాశం పెరుగుతుందని,వ్యాపారాలను విస్తరించుకోవడానికి అనుకూల వాతావరణం ఏర్పడుతుందని భావిస్తున్నారు. అమెరికా ఆర్థిక పరిస్థితి, ఉద్యోగ విపణి ప్రస్తుతం అంత బలంగా లేనందున,నిరుద్యోగం మరింత పెరిగే ప్రమాదం ఉందని ఫెడరల్ రిజర్వ్ ఛైర్మన్ జెరోమ్ పావెల్ వ్యాఖ్యానించారు. అయితే తాజా వడ్డీ కోతలతో మార్కెట్‌లో రుణాలు చౌకగా అందుబాటులోకి రావడం వల్ల ఆర్థిక వ్యవస్థకు ఊతం లభిస్తుందని, ఫలితంగా ఉద్యోగావకాశాలు పెరిగి నియామకాల పెరుగుదల సాధ్యమవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.