Gold, Silver Rates: సంక్రాంతి పండగ వేళ భారీ షాక్.. పెరిగిన బంగారం ధర.. రూ.3 లక్షలు దాటిన వెండి!
ఈ వార్తాకథనం ఏంటి
జనవరి 14వ తేదీ భోగి రోజు దేశంలో బంగారం ధర మరింత పెరిగింది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధరపై రూ.1,090 పెరుగుదల నమోదు కాగా, 22 క్యారెట్ల బంగారం ధర కూడా 10 గ్రాములపై రూ.1,000 మేర ఎగబాకింది. ఈ పెరుగుదలతో దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,43,770కు చేరింది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,31,800గా కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం స్పాట్ ధర ఔన్సుకు 4,586.49 డాలర్ల వద్ద ఉంది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో పెట్టుబడిదారులు సురక్షితమైన ఆస్తులవైపు మొగ్గు చూపుతుండటంతో బంగారం ధరలు మరింత పెరుగుతున్నాయి.
వివరాలు
హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.3,07,000
తెలుగు రాష్ట్రాల్లో కూడా బంగారం ధరలు భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,43,620గా ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,31,650గా ఉంది. ఇక వెండి ధరలు కూడా ఈ రోజు వినియోగదారులకు భారీ షాక్ ఇచ్చాయి. కిలో వెండిపై ఏకంగా రూ.15,000 పెరిగింది. దీంతో హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.3,07,000కు చేరగా, ఇతర ప్రాంతాల్లో సుమారు రూ.2,90,000 వద్ద ట్రేడవుతోంది.