Hallmarking Gold Rules: హాల్‌మార్కింగ్ లేని బంగారు ఆభరణాలను విక్రయించబోమని కేంద్రం ప్రకటన..!
దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ హాల్‌మార్క్ లేని బంగారు ఆభరణాలు విక్రయాలు జరుగుతున్నాయి. అయితే, తాజా నిర్ణయం ప్రకారం, కేంద్ర ప్రభుత్వం 18 జిల్లాల్లో హాల్‌మార్క్ లేని బంగారు ఆభరణాలను విక్రయించకూడదని స్పష్టం చేసింది. హాల్‌మార్కింగ్ రూల్ 2021 జూన్ 23 నుంచి అమలులోకి వచ్చి, ఇప్పటి వరకు దాదాపు రూ.40 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు హాల్‌మార్క్ చేయబడ్డాయి. హాల్‌మార్కింగ్‌ను కేంద్రం దశలవారీగా దేశవ్యాప్తంగా అమలు చేస్తోంది. కల్తీ ఆభరణాల బారిన పడకుండా ప్రజలను రక్షించడానికి భారత ప్రభుత్వం హాల్‌మార్కింగ్ ఆభరణాల నిబంధనలను కఠినతరం చేసింది.
గణనీయంగా పెరిగిన నగల వ్యాపారాల నమోదు
ఈ రూల్ దేశంలో 2021లో ప్రవేశపెట్టినా, ఇప్పటివరకు దశలవారీగా వివిధ జిల్లాల్లో అమలు చేస్తోంది. తాజా చర్యల్లో భాగంగా, ఆంధ్రప్రదేశ్, బీహార్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, కేరళ, ఒడిశా, పుదుచ్చేరి, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలోని 18 జిల్లాల్లో ఈ నిబంధనను పూర్తిగా అమలు చేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది. దేశవ్యాప్తంగా మొత్తం 361 జిల్లాల్లో హాల్‌మార్కింగ్ లేని బంగారు ఆభరణాల విక్రయాలు నిషేధించబడతాయి. ఇక, నగల వ్యాపారాల నమోదు సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. గతంలో 34,647గా ఉన్న రిజిస్టర్ అయిన వ్యాపారుల సంఖ్య ప్రస్తుతం 1,94,039కి పెరిగింది.
యాప్ సహాయంతో ఫేక్ హాల్‌మార్క్‌పై ఫిర్యాదు
అలాగే, హాల్‌మార్కింగ్ కేంద్రాల సంఖ్య 945 నుంచి 1,622కి చేరుకుంది. వినియోగదారులు కొనుగోలు చేసే ఆభరణాలపై హాల్‌మార్క్ ప్రామాణికతను బీఐఎస్ మొబైల్ యాప్ ద్వారా ధృవీకరించవచ్చు. ఈ యాప్ సహాయంతో ఆభరణాల నాణ్యతను పరీక్షించడమే కాకుండా, ఫేక్ హాల్‌మార్క్‌పై ఫిర్యాదు చేసే అవకాశమూ ఉంటుంది. హాల్‌మార్కింగ్ నిబంధనలు అమల్లోకి రావడంతో బంగారు ఆభరణాల నాణ్యతలో మెరుగుదల కనబడుతుండగా, వ్యాపార రంగంలో పారదర్శకత పెరుగుతోంది.