Page Loader
Indian-American: ఈ ఇండియన్-అమెరికన్ వ్యక్తి టాలెంట్‌కు అప్పట్లోనే గూగుల్ 100 మిలియన్‌ డాలర్లు..! 
ఈ ఇండియన్-అమెరికన్ వ్యక్తి టాలెంట్‌కు అప్పట్లోనే గూగుల్ 100 మిలియన్‌ డాలర్లు..!

Indian-American: ఈ ఇండియన్-అమెరికన్ వ్యక్తి టాలెంట్‌కు అప్పట్లోనే గూగుల్ 100 మిలియన్‌ డాలర్లు..! 

వ్రాసిన వారు Sirish Praharaju
May 28, 2025
01:46 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారతీయ-అమెరికన్ల ప్రభావం గ్లోబల్ టెక్‌ దిగ్గజాల్లో కొనసాగుతూనే ఉంది. మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌ వంటి అంతర్జాతీయ సంస్థలను భారత మూలాలున్న వ్యక్తులు విజయవంతంగా నడిపిస్తున్నారన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ కోవలోకి చేరిన యూట్యూబ్ సీఈఓ నీల్ మోహన్‌కు సంబంధించిన ఆసక్తికర సమాచారం ఒకటి తాజాగా వైరల్‌గా మారింది. జిరోదా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ నిర్వహిస్తున్న పాడ్‌కాస్ట్‌ కార్యక్రమానికి అనేక మంది ప్రముఖులు హాజరవుతున్నారు. ఇటీవల ఈ షోలో నీల్ మోహన్ కూడా పాల్గొని తన అనుభవాలు పంచుకున్నారు. ఆయనతో సంభాషనలో నిఖిల్ కామత్ 2011లో జరిగిన ఒక విషయాన్ని ప్రస్తావించారు. ఆ సమయంలో నీల్ మోహన్ గూగుల్‌లో అడ్వర్టైజింగ్‌ విభాగం, యూట్యూబ్ ప్రొడక్ట్ స్ట్రాటెజీలో కీలకపాత్ర పోషిస్తూ ఉన్నారు.

వివరాలు 

అండర్సెన్‌ కన్సల్టింగ్‌ లో వృత్తి జీవితం ప్రారంభం 

"మీరు మరో సంస్థకు వెళ్లిపోకుండా ఉండేందుకు గూగుల్‌ మీకు 100 మిలియన్‌ డాలర్లు ఆఫర్ చేసినట్టు చదివినట్లు గుర్తు.ఇది 15 ఏళ్ల క్రితం జరిగిన విషయమే కదా.. ఆ సమయంలో అది చాలా భారీ మొత్తం కదా?" అని కామత్ ప్రశ్నించగా, నీల్ మోహన్ దీనిని తోసిపుచ్చలేదు. అంటే ఆ విషయం నిజమేనని స్పష్టమవుతోంది. 2023 నుండి యూట్యూబ్‌ సీఈఓగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న నీల్ మోహన్,స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ నుండి ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ సాధించారు. వృత్తి జీవితం ప్రారంభంలో అండర్సన్ కన్సల్టింగ్‌ (ఇప్పటి యాక్సెంచర్‌)లో పని చేశారు. ఆ తర్వాత నెట్‌గ్రావిటీ అనే స్టార్టప్‌ సంస్థకు మారారు.ఆ స్టార్టప్‌ను డబుల్‌క్లిక్‌ అనే కంపెనీ కొనుగోలు చేసింది.

వివరాలు 

గూగుల్‌ నీల్ మోహన్‌కు 100 మిలియన్‌ డాలర్ల భారీ ఆఫర్‌

అక్కడ ఆయన మెరుగైన పనితీరు ద్వారా బిజినెస్ ఆపరేషన్స్ వైస్ ప్రెసిడెంట్‌ హోదా దక్కించుకున్నారు. 2007లో గూగుల్ డబుల్‌క్లిక్‌ను కొనుగోలు చేసింది. అప్పటి నుంచి గూగుల్ యాడ్ బిజినెస్‌లో ఆయన ముఖ్యపాత్ర పోషిస్తూ వచ్చారు. గూగుల్ ప్రొడక్ట్ డెవలప్‌మెంట్ స్ట్రాటెజీలో ఆయన కీలకవ్యక్తిగా ఎదిగారు. 2011లో ట్విటర్‌ (ప్రస్తుతం ఎక్స్‌) నుండి వచ్చిన ఆఫర్‌ను తిరస్కరించేందుకు గూగుల్‌ నీల్ మోహన్‌కు 100 మిలియన్‌ డాలర్ల భారీ ఆఫర్‌ చేసింది. ఆయనను గూగుల్‌లోనే ఉంచుకునేందుకు ఇది ఒక పెద్ద నిర్ణయంగా మారింది. అప్పటికి ఆయన మాజీ బాస్ డేవిడ్ రోజెన్‌బ్లాట్ ట్విటర్ బోర్డులో చేరారు. ఆయన చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్‌గా నీల్ మోహన్‌ను తీసుకురావాలని అనుకున్నారు. దీంతో ట్విటర్ భారీగా రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్ ప్రారంభించింది.

వివరాలు 

2015లో గూగుల్ సీఈఓగా సుందర్ పిచాయ్‌

ట్విటర్‌ చూపు మరో భారతీయుడైన సుందర్ పిచాయ్‌పైనా పడింది. గూగుల్‌ మాత్రం సుందర్ పిచాయ్‌ను 50 మిలియన్‌ డాలర్ల విలువైన స్టాక్‌ గ్రాంట్‌ ఆఫర్‌ చేసి తన వద్దే ఉంచుకుంది. అప్పటి వార్తల ప్రకారం, ఈ చర్య వల్లే పిచాయ్ గూగుల్‌ను వీడలేదు. ఆయన తర్వలోనే గూగుల్ సీఈఓగా 2015లో నియమితులయ్యారు. అనంతరం 2019లో గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్‌ ఇంక్‌ సీఈఓగా ఆయన బాధ్యతలు స్వీకరించారు.