Page Loader
Ola Electric: ఓలా ఎలక్ట్రిక్‌ కి బిగ్ షాక్.. మార్కెట్‌ వాటాలో మూడో స్థానానికి 
ఓలా ఎలక్ట్రిక్‌ కి బిగ్ షాక్.. మార్కెట్‌ వాటాలో మూడో స్థానానికి

Ola Electric: ఓలా ఎలక్ట్రిక్‌ కి బిగ్ షాక్.. మార్కెట్‌ వాటాలో మూడో స్థానానికి 

వ్రాసిన వారు Sirish Praharaju
May 28, 2025
12:57 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహనాల మార్కెట్‌లో ఓలా ఎలక్ట్రిక్‌ ఒకప్పుడు అగ్రస్థానంలో ఉండేది. కానీ ఇప్పుడు ఆ కంపెనీ స్థానం క్రమంగా తగ్గుతూ వస్తోంది. ప్రత్యర్థులైన టీవీఎస్‌ మోటార్‌, బజాజ్‌ ఆటో సంస్థలు తమ విక్రయాలను గణనీయంగా పెంచుకోవడంతో, ఓలా తన ప్రాధాన్యతను నిలుపుకోలేకపోయింది. దీంతో మే నెలలో ఓలా మూడో స్థానానికి పడిపోయింది. ఇప్పటికే రెగ్యులేటరీ ఇబ్బందులతో బాధపడుతోన్న ఓలాకు ఇది మరో దెబ్బగా నిలిచింది. ప్రభుత్వం నిర్వహించే వాహన్‌ పోర్టల్‌ గణాంకాల ప్రకారం,మే 1 నుండి 26 తేదీల మధ్య ఓలా ఎలక్ట్రిక్‌ వాహనాల రిజిస్ట్రేషన్ల సంఖ్య 15,221 మాత్రమే.

వివరాలు 

టీవీఎస్‌ మోటార్‌  మొదటి స్థానం 

గతేడాది మే నెలలో 37,388 యూనిట్లు రిజిస్టర్‌ అయ్యాయని గమనిస్తే,ఇది దాదాపు 60 శాతం తగ్గుదల. అలాగే,ఈ ఏడాది ఏప్రిల్‌ నెలలో 22.1 శాతంగా ఉన్న మార్కెట్‌ వాటా, మే నాటికి 20 శాతానికి పడిపోయింది. గతేడాది ఇదే సమయంలో ఓలా ఈవీ టూ వీలర్‌ విభాగంలో 50 శాతం మార్కెట్‌ వాటాతో అగ్రస్థానంలో ఉండేది. 2025 మే నాటికి టీవీఎస్‌ మోటార్‌ కంపెనీ 25 శాతం మార్కెట్‌ వాటాతో మొదటి స్థానాన్ని ఆక్రమించింది. బజాజ్‌ ఆటో కంపెనీ 22.6 శాతంతో రెండో స్థానంలో ఉంది. ఏథర్‌ ఎనర్జీ కంపెనీ 13.1 శాతం మార్కెట్‌ వాటాతో నాలుగో స్థానంలో నిలిచింది.

వివరాలు 

వాహనాల నాణ్యత, సర్వీస్‌ లోపాలపై ఓలా సంస్థపై CCPA దర్యాప్తు

ఇదిలా ఉండగా, మే 28 న మధ్యాహ్నం 12:17 గంటల సమయంలో ఓలా కంపెనీ షేర్లు 0.95 శాతం లాభంతో రూ.53 వద్ద ట్రేడవుతున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో వాహన్‌ పోర్టల్‌లో ఓలా ఎలక్ట్రిక్‌ వాహనాల రిజిస్ట్రేషన్లు 8,652గా నమోదు కాగా, కంపెనీ మాత్రం 25,000 యూనిట్లు విక్రయించినట్టు ప్రకటించింది. మార్చి 20 నాటికి ఈ రిజిస్ట్రేషన్ల సంఖ్య 11,781కి పెరిగింది. దీంతో ఆటోమోటివ్‌ రీసెర్చ్‌ అసోసియేషన్‌ (ARAI) కంపెనీ అందించిన వాహన విక్రయ గణాంకాలపై దర్యాప్తు ప్రారంభించింది. ఇదిలా ఉండగా, ఇప్పటికే వాహనాల నాణ్యత, సర్వీస్‌ లోపాలపై ఓలా సంస్థ సెంట్రల్‌ కంస్యూమర్‌ ప్రొటెక్షన్‌ అథారిటీ (CCPA) దర్యాప్తును ఎదుర్కొంటోంది.

వివరాలు 

 పోటీ ఒత్తిళ్ల మధ్య  మార్కెట్‌ వాటాను కోల్పోతున్న ఓలా ఎలక్ట్రిక్‌ 

అలాగే, ఓలా ఎలక్ట్రిక్‌ యాజమాన్యంలో ఉన్న అనుబంధ సంస్థ 'ఓలా సెల్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్' 2023 మేలో గిగాఫ్యాక్టరీ నిర్మాణాన్ని ప్రారంభించినా, ఇప్పటికీ దాని పురోగతిపై స్పష్టత లేకపోవడం గమనార్హం. ఈ విధంగా, అనేక పరిమితులు, దర్యాప్తులు, పోటీ ఒత్తిళ్ల మధ్య ఓలా ఎలక్ట్రిక్‌ తన మార్కెట్‌ వాటాను నెమ్మదిగా కోల్పోతూ వస్తోంది.