కొత్త విద్యుత్ రూల్స్ ప్రకటించిన కేంద్రం; పగలు తక్కువ, రాత్రి ఎక్కువ ఛార్జీల వసూలు
కేంద్ర ప్రభుత్వం కొత్త విద్యుత్ టారీఫ్‌లను ప్రకటించింది. పగలు తక్కువ విద్యుత్ ఛార్జీలు, రాత్రి పూట ఎక్కువ ఛార్జీలను వసూలు చేసేలా కొత్త రూల్స్‌ను తీసుకొచ్చింది. కొత్త నిబంధనల ప్రకారం పగటి పూట 20శాతం వరకు విద్యుత్ ఛార్జీలను తగ్గించనుంది. అలాగే రాత్రి పూట 20శాతం వరకు ఛార్జీలను పెంచడానికి అనుమతించే కొత్త నిబంధనలకు ఆమోదం తెలిపింది. డిమాండ్ తక్కువగా ఉన్నప్పుడు రద్దీ లేని సమయాల్లో విద్యుత్‌ను వినియోగించేలా ప్రజలను ప్రోత్సహించే ప్రయత్నంలో భాగంగానే కొత్త రూల్స్‌ను ప్రకటించినట్లు తెలుస్తోంది. దీని వల్ల పీక్ లోడ్ తగ్గుతుందని, గ్రిడ్ స్థిరత్వం మెరుగుపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
2024 ఏప్రిల్ నుంచి అమల్లోకి కొత్త రూల్స్
కొత్త టారిఫ్‌లు ఏప్రిల్ 2024నుంచి అమల్లోకి రానున్నాయి. తొలుత వాణిజ్య, పారిశ్రామిక వినియోగదారులకు కొత్త ఛార్జీలను వర్తింపజేస్తారు. ఏడాది తర్వాత వ్యవసాయ రంగానికి మినహా ఇతర వినియోగదారులకు అమలు చేయనున్నారు. కొత్త నియమాల ధరపై అవగాహన ఉన్న వినియోగదారులు రాత్రిపూట తక్కువ గంటలపాటు ఏసీలను నడిపే అవకాశం ఉంది. దీని ద్వారా విద్యుత్ ప్లాంట్‌లపై భారాన్ని తగ్గించడంతో పాటు రాత్రిపూట విద్యుత్ అంతరాయాలు తగ్గుతాయని ప్రభుత్వం భావిస్తోంది. కాలుష్యాన్ని తగ్గించడంలో కూడా సహాయపడుతుందని కేంద్రం యోచిస్తోంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో గత ఆరేళ్లలో ఎన్నడూ లేనంతగా విద్యుత్ కొరతను భారతదేశం చవిచూసింది. ఈ క్రమంలో భవిష్యత్‌లో ఇబ్బందులు ఎదురుకాకుండా కేంద్రం ఇప్పటి నుంచి నివారణ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.