
Silver: సెప్టెంబర్ 1 నుంచి వెండి ఆభరణాలపై హాల్‌మార్కింగ్ తప్పనిసరి.. బీఐఎస్ కొత్త నిబంధనలు!
ఈ వార్తాకథనం ఏంటి
భారతీయ సంస్కృతి, సంప్రదాయాలలో బంగారానికి ఉన్న ప్రత్యేక స్థానం అందరికీ తెలిసిందే. బంగారం తరువాత విలువైన లోహంగా వెండిని కూడా చాలా మంది భావిస్తారు. బంగారంతో పాటు వెండి ఆభరణాలను ధరించడం చాలామందికి అలవాటు. అయితే ఇప్పుడు బంగారం మాదిరిగానే వెండిపై కూడా కఠిన నియమాలను అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. వెండి ఆభరణాలకు హాల్‌మార్కింగ్‌ను తప్పనిసరి చేసే దిశగా కొత్త నిబంధనలు అమలు చేయాలని ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ప్రస్తుతం బంగారం ధరలు రికార్డు స్థాయిలో ఉండటంతో అనేక మంది వెండి వైపు మొగ్గుచూపుతున్నారు. దీనివల్ల వెండికి డిమాండ్ పెరిగి, ధరలు కూడా ఎగబాకుతున్నాయి.
Details
హాల్‌మార్కింగ్ తప్పనిసరి
ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 1, 2025 నుంచి వెండి ఆభరణాలకు కూడా హాల్‌మార్కింగ్‌ను తప్పనిసరి చేసే అవకాశం ఉంది. సెప్టెంబర్ 1, 2025 నుంచి బంగారం కోసం ఇప్పటికే అమలులో ఉన్న హాల్‌మార్కింగ్ విధానం మాదిరిగానే వెండిపైనా హాల్‌మార్కింగ్ తప్పనిసరి అవుతుంది. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) ప్రకారం, వెండి ఆభరణాలను 900, 800, 835, 925, 970, 990 అనే ఆరు స్వచ్ఛత స్థాయిల్లో వర్గీకరిస్తారు. ప్రతి ఆభరణంపై స్వచ్ఛత ఆధారంగా 6 అంకెల హాల్‌మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్ (HUID) ముద్రిస్తారు. ఈ కొత్త విధానం ప్రస్తుతం అమలులో ఉన్న హాల్‌మార్కింగ్ వ్యవస్థను భర్తీ చేయనుంది.
Details
సెప్టెంబర్ 1 నుంచి అమలు
హాల్‌మార్కింగ్ అనేది విలువైన లోహ ఆభరణాల స్వచ్ఛతను నిర్ధారించే అధికారిక ప్రక్రియ. ఇది ఆభరణాలు చట్టపరమైన స్వచ్ఛత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయని ధృవీకరిస్తుంది. భారత్‌లో బీఐఎస్ ఈ హాల్‌మార్కింగ్‌ను అమలు చేస్తుంది. సెప్టెంబర్ 1, 2025 నుంచి వెండి ఆభరణాలపై హాల్‌మార్కింగ్ తప్పనిసరి అయిన తర్వాత, కొనుగోలుదారులు బీఐఎస్ కేర్ యాప్‌లోని "వెరిఫై HUID" ఫీచర్ ద్వారా ఆభరణాల స్వచ్ఛతను సులభంగా చెక్ చేసుకోవచ్చు.