HCL Tech: హెచ్‌సీఎల్ టెక్ షేర్లు 10శాతం పతనం.. రూ. 46,987 కోట్లు ఆవిరైన మార్కెట్ విలువ
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ ఐటీ కంపెనీ హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ షేర్లు ఈ రోజు ట్రేడింగ్ సెషన్‌లో భారీ నష్టాలను ఎదుర్కొన్నాయి.
డిసెంబరు త్రైమాసిక ఫలితాలు ప్రకటించిన తర్వాతి రోజే మంగళవారం కంపెనీ షేర్లు 10 శాతం వరకు పడిపోయాయి. బీఎస్ఈలో కంపెనీ షేరు 9.41 శాతం నష్టపోయి రూ.1,798.40కి చేరగా, ఎన్‌ఎస్‌ఈలో 9.63 శాతం క్షీణించి రూ.1,797.75 వద్ద ముగిసింది.
ఈ పరిణామాలతో కంపెనీ మార్కెట్ విలువ రూ.46,987.11 కోట్లు తగ్గి, మొత్తంగా రూ.4,91,743.25 కోట్లకు చేరింది.
డిసెంబరు త్రైమాసిక ఫలితాలు మదుపర్లను నిరాశపరచడంతో పాటు, నాలుగో త్రైమాసికానికి సంబంధించి కంపెనీ విడుదల చేసిన భవిష్యత్తు అంచనాలు కూడా ఆశించినంత ప్రభావం చూపలేకపోయాయని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Details
నష్టాల్లో ట్రేడవుతున్న టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్
దీంతో షేర్లు ఉదయం 10 శాతం క్షీణించినా ఆ తర్వాత స్వల్పంగా కోలుకున్నాయి. మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో హెచ్‌సీఎల్ షేర్లు 8.29 శాతం నష్టంతో రూ.1,825 వద్ద ట్రేడవుతున్నాయి.
ఇతర ఐటీ కంపెనీలు టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, టీసీఎస్ షేర్లు కూడా నష్టాల్లో ట్రేడవుతున్నాయి. హెచ్‌సీఎల్ టెక్ డిసెంబరు త్రైమాసికంలో రూ.4,591 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది.
ఇది గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 5.54 శాతం అధికం.
అలాగే ఆదాయం రూ.28,446 కోట్ల నుంచి 5.07 శాతం పెరిగి రూ.29,890 కోట్లకు చేరింది. సెప్టెంబరు త్రైమాసికంతో పోలిస్తే లాభం 8.4 శాతం, ఆదాయం 3.56 శాతం పెరిగింది.
Details
ఇవాళ లాభాల పట్టిన అదానీ గ్రూప్ షేర్లు
మరోవైపు అదానీ గ్రూప్‌కు చెందిన షేర్లు ఈ రోజు ట్రేడింగ్ సెషన్‌లో మరింత పుంజుకున్నాయి.
నిన్న నష్టాల్లో ముగిసిన అదానీ గ్రూప్ షేర్లు నేడు లాభాల బాట పట్టాయి. ఇంట్రాడే ట్రేడింగ్‌లో అదానీ పవర్ షేర్లు 19 శాతం పెరిగాయి.
అదానీ గ్రీన్ ఎనర్జీ 14.54 శాతం, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ 14.38 శాతం, అదానీ టోటల్ గ్యాస్ 13 శాతం, ఎన్డీటీవీ 12.50 శాతం లాభాలు నమోదు చేశాయి.
అదానీ ఎంటర్‌ప్రైజెస్ 8.90 శాతం, అదానీ పోర్ట్స్ 6 శాతం, అంబుజా సిమెంట్స్ 4.79 శాతం, ఏసీసీ 4.50 శాతం, అదానీ విల్మర్ 3 శాతం లాభాలతో ముందంజ వేశాయి.