
Savings Account: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తాజా ట్విస్ట్.. సేవింగ్స్ అకౌంట్లపై వడ్డీ తగ్గింపు!
ఈ వార్తాకథనం ఏంటి
భారతదేశంలోని అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ అయిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లు ఏప్రిల్ 15న భారీగా ఎగబాకాయి.
3 శాతానికి పైగా పెరిగిన ఈ స్టాక్ పరుగులు పెట్టడానికి ప్రధాన కారణం బ్యాంక్ తీసుకున్న వడ్డీ రేట్ల తగ్గింపు నిర్ణయమేనని నిపుణుల అభిప్రాయం.
ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ద్రవ్య పరపతి సమీక్షలో పాలసీ రేటును తగ్గించగా, దానితో అనుసంధానంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కూడా ఏప్రిల్ 12 నుంచి రూ. 50 లక్షలలోపు డిపాజిట్లపై సేవింగ్స్ అకౌంట్ వడ్డీ రేటును 3 శాతం నుంచి 2.75 శాతానికి తగ్గించింది.
ఈ మొత్తానికి మించిన డిపాజిట్లపై సంవత్సరానికి 3.25 శాతం వడ్డీ చెల్లించే అవకాశం ఉంది.
Details
అత్యధిక లాభాల్లో నిలిచిన షేర్లలో ఒకటి
జూన్ 2020లో కోవిడ్ సమయంలో మాత్రమే ఈ స్థాయిలో తగ్గింపులు చేశారు.
ఈ పరిణామాల నేపథ్యంతో మంగళవారం ట్రేడింగ్ సెషన్‌లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్ NSEలో ఇంట్రాడేలో 4 శాతానికి పైగా పెరిగి రూ. 1876.80 గరిష్టాన్ని టచ్ చేసింది.
మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ షేరు రూ. 1872 వద్ద 3.60 శాతం లాభంతో ట్రేడవుతోంది. నిఫ్టీ 50లో అత్యధిక లాభాల్లో నిలిచిన షేర్లలో ఇది ఒకటిగా నిలిచింది.
కోవిడ్ సమయంలో లిక్విడిటీ ఎక్కువగా ఉండటంతో, అప్పట్లో సేవింగ్స్ అకౌంట్ రేట్లు తగ్గించిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్.. ఇప్పుడు తాజాగా తీసుకున్న నిర్ణయంతో ప్రభుత్వ రంగ బ్యాంకుల వడ్డీ రేట్లకు సమీపంలోకి వచ్చింది.
Details
రూ. 50 లక్షల లోపు డిపాజిట్లపై 3 శాతం వడ్డీ
అంతేకాకుండా ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంకులతో పోలిస్తే కూడా ఇప్పుడు తక్కువ రేటు కలిగి ఉంది. ఈ రెండు బ్యాంకులు రూ. 50 లక్షల లోపు డిపాజిట్లపై 3 శాతం వడ్డీ ఇస్తున్నాయి.
2023లో మాతృ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీని విలీనం చేసిన తర్వాత, ఈ ప్రైవేట్ బ్యాంక్ టర్మ్ డిపాజిట్లను పెంచేందుకు కసరత్తు ప్రారంభించింది.
సేవింగ్స్ రేటు తగ్గించడంతో, డిపాజిటర్లు ఎక్కువ వడ్డీ ఇచ్చే టర్మ్ డిపాజిట్లు లేదా రికరింగ్ డిపాజిట్ల వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది.
ఖాతాదారులు ఎక్కువగా సేవింగ్స్ అకౌంట్‌ను లావాదేవీల కోసమే ఉపయోగిస్తుండగా, అదనంగా ఉన్న డబ్బును ఫిక్స్‌డ్ డిపాజిట్లుగా పెట్టేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు.
Details
సేవింగ్స్ అకౌంట్ రేటును పెంచని హెచ్‌డీఎఫ్‌సీ
గడచిన 14 ఏళ్లలో సేవింగ్స్ అకౌంట్ రేటును హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ పెంచిన దాఖలాలు లేవు.
ఈ చర్యతో బ్యాంక్ డిపాజిట్ల వృద్ధిపై విశ్వాసాన్ని కలిగించిందని, అలాగే సెంట్రల్ బ్యాంక్ ధోరణికి అనుగుణంగా వ్యవహరిస్తోందని అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థ గోల్డ్‌మన్ సాక్స్ పేర్కొంది.
అంతేకాదు, ఈ చర్య బ్యాంకు మార్జిన్ ఒత్తిడిని తగ్గించడానికి దోహదపడనుందని విశ్లేషణ.
ఇక ఆర్‌బీఐ మానిటరీ పాలసీ కమిటీ ఏప్రిల్ 9న రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీంతో 6.25 శాతం నుంచి 6 శాతానికి తీసుకురావడం గమనార్హం.
ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ప్రకారం, మార్చి చివర్లో జరిగిన చర్యల వల్ల బ్యాంకింగ్ వ్యవస్థలో లిక్విడిటీ లోటు నుండి మిగులుగా మారిందని స్పష్టం చేశారు.