Petrol Price : వాహనదారులకు గుడ్‌న్యూస్.. OMCలు ఆటో ఇంధన ధరలను లీటరుకు రూ. 2-3 తగ్గించవచ్చు: ICRA
పెట్రోల్, డీజిల్ ధరలు దేశంలో కొంత కాలంగా గరిష్ట స్థాయిల్లో ఉన్నాయి. ప్రస్తుతం లీటర్‌కు పెట్రోల్ ధర రూ. 100ను మించిపోయి ఉంది.అలాగే డీజిల్ ధర కూడా దాదాపు అంతే ఉంది. భారత్‌లో పెట్రోల్,డీజిల్ ధరలలో గణనీయమైన మార్పులు మూడేళ్లకు పైగా చోటు చేసుకోలేదు. ఇటీవల, దేశంలో సార్వత్రిక ఎన్నికల మునుపు చమురు కంపెనీలు లీటర్‌పై రూ. 2 చొప్పున తగ్గించాయి, కానీ ఆ తర్వాతి కాలంలో ధరలలో ఎలాంటి మార్పు లేదు. అంతకంటే ముందు, 2022 మే నెలలోనే పెట్రోల్, డీజిల్ ధరలు మారినట్లు చెబుతారు. ఇటీవల, అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధరలు భారీగా తగ్గినప్పటికీ, కేంద్రం, చమురు కంపెనీలు దేశీయంగా ధరలను మార్చేందుకు ప్రాధాన్యత ఇవ్వట్లేదు.
దీపావళికి ముందే తగ్గనున్న పెట్రోల్ ధరలు!
అంతర్జాతీయ రేట్లు తగ్గుతున్నందున, దేశంలో కూడా ఇంధన ధరలు తగ్గుతాయని ప్రజలు ఆశిస్తున్నారు. ఈ విషయం గురించి చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. అంతర్జాతీయ చమురు రేట్లు పడిపోతున్న వేళ, దేశీయ చమురు సంస్థల మార్జిన్లు పెరుగుతున్నాయి. అందువల్ల, లీటరుకు రూ. 2 నుండి 3 వరకు ధరలను తగ్గించే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. దీపావళి పండుగకు ముందు ఈ ధరలు తగ్గే అవకాశమున్నాయని అంచనా వేస్తోంది. సెప్టెంబర్‌లో భారత్ దిగుమతి చేసుకున్న క్రూడాయిల్ సగటు ధర బ్యారెల్‌కు 74 డాలర్లుగా ఉంది. అయితే ఈ సంవత్సరం మార్చి నెలలో ఇది 83-84 డాలర్లుగా ఉన్నది.
రిటైల్ చమురు ధరలు తగ్గవచ్చు
అంతర్జాతీయ క్రూడాయిల్ ధరలు కనిష్ట స్థాయిలో ఉండటంతో, ప్రభుత్వ రంగ చమురు సంస్థల మార్జిన్లు మెరుగయ్యాయని, ఈ ధోరణి కొనసాగితే రిటైల్ చమురు ధరలు తగ్గవచ్చు అని రేటింగ్ సంస్థ పేర్కొంది. అంతర్జాతీయ రేట్లతో పోలిస్తే,చమురు సంస్థలు పెట్రోల్‌పై లీటరుకు రూ. 15, డీజిల్‌పై రూ. 12 చొప్పున మలచుకుంటున్నాయని ఇక్రా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గిరీశ్ కుమార్ చెప్పారు. అంతర్జాతీయ రేట్లకు అనుగుణంగా, దేశీయ ఇంధన ధరలను సవరించుకునే విధానం 2021 నుండి అమల్లో ఉన్నప్పటికీ, చమురు సంస్థలు మాత్రం ధరలను మార్చడం లేదు.
ఇంధన ధరలు తగ్గే అవకాశం
గతంలో, ప్రతి రోజు ఉదయాన్నే పెట్రోల్, డీజిల్ ధరలలో 10 పైసలు, 50 పైసలు, లేదా 60 పైసలు హెచ్చుతగ్గులు జరుగుతున్నాయి. కానీ ఈ విధానం ఇక కొనసాగించడం లేదు. ఇటీవల, దేశీయంగా ఉత్పత్తి అవుతున్న చమురు ఉత్పత్తుల ఎగుమతులపై కేంద్రం విండ్‌ఫాల్ టాక్స్‌ను తొలగించిన విషయం కూడా గమనించదగినది. ఈ నేపథ్యంలో త్వరలో ఇంధన ధరలు తగ్గే అవకాశమున్నట్లు తెలుస్తోంది.