Page Loader
Adani Group: అదానీ గ్రూప్ మరో కొత్త సిమెంట్‌ కంపెనీ కొనుగోలు.. 52వారాల గరిష్ట స్థాయికి హైడెల్‌బర్గ్ సిమెంట్ ఇండియా షేర్లు

Adani Group: అదానీ గ్రూప్ మరో కొత్త సిమెంట్‌ కంపెనీ కొనుగోలు.. 52వారాల గరిష్ట స్థాయికి హైడెల్‌బర్గ్ సిమెంట్ ఇండియా షేర్లు

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 07, 2024
02:03 pm

ఈ వార్తాకథనం ఏంటి

అదానీ గ్రూప్‌ (Adani Group) తమ సిమెంట్‌ వ్యాపారాన్ని మరింత విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. జర్మనీకి చెందిన హైడెల్‌బెర్గ్‌ మెటీరియల్స్‌ ఇండియా యూనిట్‌ అయిన హైడెల్‌బెర్గ్‌ సిమెంట్‌ ఇండియాను (HeidelbergCement India) కొనుగోలు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం చర్చలు జరుగుతున్నట్లు సంబంధిత వర్గాలు తెలియజేశాయి. ఈ ఒప్పందం కోసం అదానీ గ్రూప్‌ అంబుజా సిమెంట్‌ ద్వారా సుమారు రూ.10 వేల కోట్ల పెట్టుబడిని పెట్టాలని చూస్తోంది. అదానీ గ్రూప్‌ కొనుగోలు వార్తల నేపథ్యంలో హైడెల్‌బెర్గ్‌ ఇండియా షేర్లు సోమవారం భారీగా పెరిగాయి. ఇంట్రాడే ట్రేడింగ్‌లో వాటి విలువ 18 శాతం వరకు పెరిగి, బీఎస్‌ఈలో 17.95 శాతం లాభంతో 52 వారాల గరిష్ఠ స్థాయి అయిన రూ.257.85ను తాకింది.

వివరాలు 

మైసెమ్‌,జువారీ సిమెంట్స్‌ పేర్లతో హైడెల్‌బెర్గ్‌ సిమెంట్‌ కంపెనీ

ఎన్‌ఎస్‌ఈలోనూ ఈ షేరు రూ.258ని చేరింది, కానీ ఆ తర్వాత కొంత తగ్గింది.అయితే,అంబుజా సిమెంట్‌ షేర్లు మాత్రం 2.21 శాతం మేర తగ్గాయి. సిమెంట్‌ రంగంలో అగ్రగామిగా నిలవాలని అదానీ గ్రూప్‌ కసరత్తు చేస్తోంది.2022లో హోల్సిమ్‌ గ్రూప్‌ నుంచి అంబుజా,ఏసీసీ సిమెంట్లను కొనుగోలు చేసిన అదానీ,ఆతర్వాత పెన్నా,సంఘీ ఇండస్ట్రీస్‌లను కూడా సొంతం చేసుకుంది. మరిన్ని సిమెంట్‌ కంపెనీల్లో వాటాలను కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉంది.ఈ ప్రయత్నంతో, ప్రస్తుతం సిమెంట్‌ రంగంలో అగ్రస్థానంలో ఉన్న బిర్లా గ్రూప్‌కు చెందిన అల్ట్రాటెక్‌ సిమెంట్‌ను అధిగమించి,నంబర్‌ 1 స్థాయికి చేరుకోవాలనే లక్ష్యాన్ని అదానీ గ్రూప్‌ పెట్టుకుంది. అల్ట్రాటెక్‌ సైతం విస్తరణలో వ్యాపార పథకాలు అమలు చేస్తోంది.హైడెల్‌బెర్గ్‌ సిమెంట్‌ కంపెనీ మైసెమ్‌,జువారీ సిమెంట్స్‌ పేర్లతో దేశంలో వ్యాపారాలు నిర్వహిస్తోంది.