Crypto : రూ.2,500 కోట్ల భారీ క్రిప్టో స్కామ్.. ఎక్కడ,ఎలా జరిగిందో తెలుసా
హిమాచల్ ప్రదేశ్‌లో కనీవినీ ఎరుగని రీతిలో కుంభకోణం జరిగింది. ఈ మేరకు దాదాపు రూ.2500 కోట్ల మాయమయ్యాయి. అయితే ఈ పథకంలో నష్టపోయిన లక్ష మంది పెట్టుబడిదారుల్లో ప్రభుత్వ ఉద్యోగులు ఉండటం గమనార్హం. ఈ క్రమంలోనే సుమారుగా 4,000 నుంచి 5,000 మంది సర్కారు ప్రతినిధులు ఉన్నట్లు తెలుస్తోంది. హిమాచల్ ప్రదేశ్‌లో రూ. 2,500 కోట్ల క్రిప్టో కరెన్సీ కుంభకోణం వెనుక మోసగాళ్లు, రోడ్డు ప్రాజెక్టుల కోసం ప్రభుత్వం సేకరించిన భూమికి పరిహారం పొందిన వ్యక్తులనే టార్గెట్ గా ఎంచుకున్నారు. ఇదే సమయంలో అగ్రశ్రేణి ఏజెంట్లకు విదేశీ పర్యటనలకు పంపడం ద్వారా కార్పొరేట్ తరహా కార్యకలాపాలు సాగించారని సిట్ విచారణలో వెల్లడించింది.
ఏకంగా 2 వేలకుపైగా ఫారిన్ ట్రిప్స్
గరిష్ట సంఖ్యలో పెట్టుబడిదారులను తీసుకువచ్చి ఉత్తమ పనితీరు కనబరిచిన ఏజెంట్లను థాయిలాండ్, దుబాయ్ సహా ఇతర ప్రదేశాల్లో విదేశీ పర్యటనల కోసం ఎంపిక చేశారని తెలిపింది. ఏకంగా 2,000కిపైగా విలాస పర్యటనలు జరిగాయని సిట్ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో విదేశాలకు వెళ్లేందుకు రూ. 3.5 కోట్లు వెచ్చించారని సిట్‌కు నేతృత్వం వహిస్తున్న ఉత్తర శ్రేణి డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిఐజ) అభిషేక్ ధుల్లార్ మంగళవారం తెలిపారు. రాష్ట్రంలో నాలుగు లేన్ల ప్రాజెక్టుల కోసం ప్రభుత్వం తమ భూమిని సేకరించిన తర్వాత పరిహారం పొందిన అనేక మందిని మండి, హమీర్‌పూర్ కాంగ్రా జిల్లాల్లోని నేరగాళ్లు తమ డబ్బును క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఎర వేశారని చెప్పారు.
ఇవి నకిలీ క్రిప్టోకరెన్సీ : సిట్
ఈ మేరకు అవి నకిలీ క్రిప్టోకరెన్సీ అని కుంభకోణంపై విచారణ జరుపుతున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) పోలీసులు తేల్చేశారు. ఈ క్రమంలోనే దాదాపుగా రూ. 2,500 కోట్ల భారీ మొత్తాన్ని హిమాచల్ క్రిప్టో స్కామ్ వెనుక ఏజెంట్లు పెట్టుబడిదారులను లక్ష్యంగా చేసుకున్నారని వివరించారు. మరోవైపు ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు 18 మందిని అరెస్టు చేశామన్నారు. ఈ కేసుకు సంబంధించి నలుగురు కీలక నిందితులు హేమరాజ్, సుఖ్‌దేవ్, అరుణ్ గులేరియా, అభిషేక్ లను అరెస్ట్ చేశారు. ఇందులో నలుగురు పోలీస్ సిబ్బంది, ఒక ఫారెస్ట్ గార్డు ఉండటం గమనార్హం. అయితే ప్రధాన నిందితుడు కింగ్‌పిన్ సుబాష్ మాత్రం ఇంకా పరారీలోనే ఉన్నాడు.